భావ ప్రకటనా స్వేచ్ఛే ఓ జోక్‌!

21 Sep, 2018 17:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఒడిశాలోని కోణార్క్‌ సూర్య దేవాలయంపైనున్న శిల్పాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రక్షణ శాఖ విశ్లేషకుడు అభిజిత్‌ ఐయ్యర్‌ మిత్రాపై ఒడిశా అసెంబ్లీలో పెద్ద దుమారం రేగడం, ఆయనపై రాష్ట్ర అసెంబ్లీ సభా హక్కుల నోటీసు జారీ చేయడం, రాష్ట్ర పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఆయన్ని అరెస్ట్‌ చేయడం, తక్షణమే అభిజిత్‌కు బెయిల్‌ మంజూరవడం గురువారం ఒక్క రోజే వేగంగా జరిగిన పరిణామాలు. ఒడిశా పాలకపక్ష బిజూ జనతాదళ్‌ నుంచి ఇటీవలనే బయటకు వచ్చిన మాజీ పార్లమెంట్‌ సభ్యుడు బైజయంత్‌ జైపాండేకు చెందిన హెలికాప్టర్‌లో అభిజిత్‌ ఐయ్యర్‌ మిత్రా, జర్నలిస్ట్‌ ఆర్తి టికూ సింగ్‌ కొణార్క్‌ పర్యటనకు వెళ్లారు.

బుధవారం కోణార్క్‌ సూర్య దేవాలయాన్ని సందర్శించిన అభిజిత్‌ ఐయ్యర్, అక్కడి ఆలయ గోడలపై అసభ్య భంగిమల్లో ఉన్న దేవతా విగ్రహాలను చూసి ‘ఇదేమీ విగ్రహాలు! హిందువులను అవమానించేందుకే ముస్లింలు ఈ విగ్రహాలను ఇలా చెక్కించారేమో (అసభ్య పదాలను మినహాయించాం). రేపు కట్టబోయే మా రామమందిరంలో ఇలాంటి విగ్రహాలు ఉండవు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం తన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై ఒడిశా అసెంబ్లీ, ఒడిశా పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్ర అసెంబ్లీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసును జారీ చేయగా, పోలీసులు భిన్న మతాల మధ్యన వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారంటూ భారతీయ శిక్షాస్మృతిలోని 153ఏ సెక్షన్‌ కింద, వ్యక్తుల మత విశ్వాసాలను కించపరిచారంటూ 295ఏ, 298 సెక్షన్ల కింద అభిజిత్‌పై కేసులు నమోదు చేశారు.

సాహితీవేత్తలు, విద్యావేత్తలు, కళాకారుల సృజనాత్మక చర్యలను అణచివేసేందుకు ప్రభుత్వాలు ఎక్కువగా 295ఏ, 298 సెక్షన్లను ఉపయోగిస్తాయి. ఇక ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తే 12ఏ సెక్షన్‌ కింద ఏకంగా దేశద్రోహం కేసులనే పెడతాయి. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛను హరించి వేస్తున్న ఈ సెక్షన్లు బ్రిటీష్‌ కాలం నాటివి. రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం ప్రభుత్వాలు ఈ సెక్షన్లను ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నాయి. పార్టీని విడిచిపెట్టి వెళ్లిన బైజయంత్‌ జయ్‌ పాండే అతిథిగా వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే ఒడిశా ప్రభుత్వానికి ఎక్కువ కోపం వచ్చినట్లుంది. చిలికీ సరస్సు మీదుగా వెళ్లిందన్న కారణంగా పాండే హెలికాప్టర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పర్యావరన పరిస్థితుల పరిరక్షణలో భాగంగా చిలికీ సరస్సు మీదుగా హెలికాప్టర్‌ను అనుమతించమని ప్రభుత్వం చెబుతోంది. తన వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించరాదని, జోక్‌ చేశానని అభిజిత్‌ సమర్థించుకునేందుకు ఎంత ప్రయత్నించినా పోలీసులుగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ ఆయన్ని వదిలి పెట్టడం లేదు. ఈ నెల 28వ తేదీన ఆయన విచారణకు హాజరుకావాల్సిందే. నిజంగా అభిజిత్‌ వ్యాఖ్యల్లో జోక్‌ లేదుగానీ దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందనుకోవడం మాత్రం పెద్ద జోకే!

మరిన్ని వార్తలు