ఆ ‘కనుగీటే’ సన్నివేశం ఊహించనిది!

14 Feb, 2018 14:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఒరు ఆదార్‌ లవ్‌’ మలయాళ చిత్రంలో హీరోయిన్‌ ప్రియా వారియర్‌ కనుగీటిన సన్నివేశం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఒరు ఆదార్‌ లవ్‌ అంటే అసాధారణ ప్రేమ అని అర్థం. జూన్‌ చివరలో విడుదలవుతున్న ఈ చిత్రంలో మొత్తం ఎనిమిది పాటలు ఉన్నాయి. అందుకని దీన్ని ‘సంగీతభరిత ప్రేమ కథా చిత్రం’ అని పిలవచ్చు. ఈ పాటల వీడియోను ఫిబ్రవరి 9వ తేదీన మార్కెట్‌లోకి విడుదల చేశారు. అందులోని ‘మాణిక్య మలరాయ పూవి’ పాటలోనిదే ప్రియా వారియర్‌ కనుగీటే సన్నివేశం.

11, 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఐదుగురు హీరోలు, నలుగురు బాలికల మధ్య నడిచే ప్రేమాయణం, వారిచుట్టూ అల్లుకునే స్నేహబంధం, వారి జీవితాల నేపథ్యంలో సినిమా నడుస్తుంది. సినిమాలో రకరకాల ప్రేమను చూపిస్తారు. అందులో అసాధారణ ప్రేమ ఏమిటో ప్రేక్షకులే నిర్ణయించాల్సి ఉంటుంది. మలబారు ప్రాంతం ముస్లిం మహిళలు పాడుకునే  ‘మాణిక్య మలరాయ పూవి’ అనే పాటను ఈ సినిమాలో చూపించారు. మొహమ్మద్‌ ప్రవక్త, ఆయన భార్య ఖదీజా మధ్య నుండే పవిత్ర ప్రేమకథనే ముస్లిం మహిళలు పాటగా పాడుతారు. అయితే ప్రవక్త ప్రేమ కథను చూపించారన్న కారణంగా సినిమాలోని ఈ పాటను నిషేధించాల్సిందిగా కొంత మంది ముస్లింలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే విషయమై హైదరాబాద్‌లో పోలీసులకు పలువురు ఫిర్యాదు కూడా చేశారు.

‘మాణిక్య మలరాయ పూవి’ పాటను 1978 పీఎంఏ జబ్బర్‌ రాయగా, తలస్సరీ కే. రెఫీక్‌ సంగీతం సమకూర్చారు. ఆ పాటంటే తన తల్లికి ఎంతో ఇష్టమని, చిన్నప్పటి నుంచి తాను ఆ పాట వింటూనే పెరిగానని, అందుకనే ఆ పాట హక్కులను కొన్నానని చిత్రం దర్శకుడు ఒమర్‌ లూలు మీడియాకు తెలిపారు. సంగీత దర్శకులు షాన్‌ రెహమాన్‌ మళ్లీ పాటను కంపోజ్‌ చేయగా, వినీత్‌ శ్రీనివాసన్‌ అద్భుతంగా పాడారని ఆయన తెలిపారు.

ఊహించిన దానికంటే ఇప్పుడు ఈ పాట పాపులర్‌ అయిందని, ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు విశేష ఆధరణ లభిస్తోందని చెప్పారు. ప్రవక్త, ఆయన భార్య మధ్య నున్న ప్రేమ గురించి చెప్పడం ఇస్లాంకు వ్యతిరేకమని కొంత మంది వ్యతిరేకిస్తున్నారని, అయితే అలాంటి వారి సంఖ్య చాలా తక్కువని ఆయన అన్నారు. మలబారు ప్రాంతం ముస్లిం మహిళలు మత, ఇతర సామాజిక కార్యక్రమాల సందర్భంగా ప్రవక్త ప్రేమ గురించి పాటలు పాడడం ఇప్పటికీ చూడవచ్చని ఆయన చెప్పారు.

ఈ సినిమాలో ప్రియా వారియర్‌ది చిన్న పాత్రేనని, సినిమా షూటింగ్‌లో అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన మేరకు ఆమె కనుగీటే సన్నివేశాన్ని షూట్‌ చేశామని ఒమర్‌ లూలు తెలిపారు. సన్నివేశం బాగా పండిందని అనుకున్నాంగానీ, ఇంతగా సోషల్‌ మీడియాను ఆకర్షిస్తుందని ఊహించలేదని ఆయన వివరించారు. ఒమర్‌ లూలు ఇంతకుముందు తీసిన ‘హాపీ వెడ్డింగ్‌ (2016)’ ‘చుంక్జ్‌ (2017)’ సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద హిట్టయ్యాయి.

మరిన్ని వార్తలు