ప్రియాంక వర్సెస్‌ అమృతా ఫడ్నవీస్‌

29 Dec, 2019 14:42 IST|Sakshi

ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ భార్య అమృతా ఫడ్నవీస్‌, శివసేన నేత ప్రియాంక చతుర్వేదిల మధ్య సంవాదం ముదురుతోంది. తనను టార్గెట్‌ చేస్తున్నారన్న అమృత వ్యాఖ్యలపై ప్రియాంక తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఖాతాలను యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు మార్చాలని థానే మేయర్‌ తీసుకున్న నిర్ణయం వివాదానికి కేంద్ర బిందువైంది. అమృత ఫడ్నవీస్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ ఉద్యోగి అయినందునే అప్పట్లో యాక్సిస్‌ బ్యాంకుకు థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఖాతాలను మళ్లించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. యాక్సిస్‌ బ్యాంకుకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రియాంక సందేహం వ్యక్తం చేశారు.

యాక్సిస్‌ బ్యాంకుకు ఖాతాలు బదలాయించిన తర్వాత బ్యాంకు సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి బీజేపీ పథకాలకు ఎంత నిధులు వచ్చాయనేది విచారణలో నిగ్గుతేల్చాలని ఆమె డిమాండ్‌ చేశారు. మహారాష్ట్ర ప్రజలకు సలహాలివ్వడం, బోధనలు చేయడం యాక్సిస్‌ బ్యాంక్‌ ఉద్యోగి పరిధిలోకి రాని అంశాలని అమృతా ఫడ్నవీస్‌కు ప్రియాంక చతుర్వేది చురకలు అంటించారు. మరోవైపు ఖాతాలను జాతీయ బ్యాంకులకు బదలాయించాలని, యాక్సిస్‌ బ్యాంక్‌ను పోషించింది చాలని బీఎంసీ సేన కార్పొరేటర్‌ సమాధాన్‌ సర్వంకర్‌ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను కోరారు. ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్‌లో ఫడ్నవీస్‌ భార్య పనిచేస్తున్నందునే ప్రభుత్వ ఖాతాలను ఆ బ్యాంకుకు మళ్లించారని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.

చదవండి : యాక్సిస్‌కు దూరమైన ‘అమృత’ ఘడియలు!

>
మరిన్ని వార్తలు