ఆ విషయం నిజంగా బాధిస్తోంది : ప్రియాంక

17 Apr, 2019 16:06 IST|Sakshi

న్యూఢిల్లీ : తనతో అసభ్యంగా ప్రవర్తించిన నాయకులను తిరిగి పార్టీలో కొనసాగించడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ తీరు తనను ఎంతగానో బాధించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ‘ఎంతోమంది త్యాగాలతో రూపుదిద్దుకున్న పార్టీలో కొంత మంది గూండాలకు ఇంకా ప్రాధాన్యం దక్కుతోంది. అభ్యంతరకరంగా మాట్లాడి, నన్ను బెదిరించిన వాళ్లకు కనీస శిక్ష పడకపోవడం చాలా బాధిస్తోంది. నిజంగా ఇది విచారకరం అని ట్వీట్‌ చేశారు. అదే విధంగా ప్రియాంక చతుర్వేదితో అసభ్యంగా ప్రవర్తించిన నాయకులను పార్టీలో పునరుద్ధరిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ విడుదల చేసిన లేఖ అంటూ ఓ జర్నలిస్టు షేర్‌ చేసిన ఫొటోను తన ట్వీట్‌కు జతచేశారు.

అసలేం జరిగిందంటే..
యూపీలోని మథురలో ప్రియాంక చతుర్వేది నిర్వహించిన పత్రికా సమావేశంలో రఫేల్‌ ఒప్పందం గురించి మాట్లాడారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొంతమంది కాంగ్రెస్‌ నేతలు ఆమెతో తప్పుగా ప్రవర్తించారు. దీంతో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వారిని సస్పెండ్‌ చేసింది. అయితే పశ్చిమ యూపీ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ఇన్‌చార్జి జ్యోతిరాదిత్య సింధియా జోక్యంతో సస్పెండ్‌ అయిన నాయకులను పార్టీ పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో ఆవేదనకు గురైన ప్రియాంక సొంత పార్టీపై ఫైర్‌ అయ్యారు. కాగా తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంకా గాంధీ తూర్పు యూపీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. సోదరీసోదరులకు వందనం అంటూ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్న ప్రియాంక.. యూపీలో మహిళా నాయకురాలి పట్ల పార్టీ నేతలు వ్యవహరించిన తీరుపై ఏవిధంగా స్పందిస్తారోనన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు