కార్యకర్తలతో సరదగా ముచ్చటించిన ప్రియాంక గాంధీ

28 Mar, 2019 17:13 IST|Sakshi

లక్నో : ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత ప్రియాంక గాంధీ చాలా కలుపుగోలుగా వ్యవహరిస్తూ.. సామాన్యులతో కలిసి పోతున్నారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి బుధవారం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న ప్రియాంక గాంధీ గత రాత్రి అమేథీ నుంచి రాయ్‌బరేలీకి వెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్‌ నాయకులు ప్రియాంక గాంధీకి లడ్డూలతో తులాభారం నిర్వహించాలనుకున్నారు. అందుకు కోసం టెంట్‌ వేసి కాంటాను తెచ్చి అలంకరించి.. లడ్డూల ప్యాకెట్లతో సిద్ధంగా ఉన్నారు. ఇంతలో ఆ మార్గంలో ప్రియాంక వాహనం రావడం గమనించి అక్కడకు వెళ్లి ఆమెను ఆహ్వానించారు.

టెంట్‌ వద్దకు వచ్చాక ప్రియాంక గాంధీని కాంటాలో కూర్చోమని.. లడ్డూలతో తులాభారం వేస్తామని కోరారు. అందుకు ప్రియాంక ‘నేను ఒక క్వింటాల్‌ కన్నా ఎక్కువ బరువుంటానని అనుకుంటున్నారా ఏంటి’ అంటూ నవ్వుతూ ప్రశ్నించారు. ఆ తర్వాత వారి అభ్యర్థనను సున్నితంగా తోసి పుచ్చారు. అంతేకాక పక్కనే ఉన్న మరో వ్యక్తిని ఉద్దేశిస్తూ.. ‘మీరు వెళ్లి కూర్చొండి’ అని చెప్పారు. దాంతో ప్రియాంక కోసం తెచ్చిన లడ్డూలతో సదరు వ్యక్తికి తులాభారం వేశారు. అనంతరం ఆ లడ్డూలను కాంగ్రెస్‌ కార్యకర్తలకు, నాయకులకు.. అక్కడికి వచ్చిన జనాలకు పంచి పెట్టారు.

ఇకపోతే పార్టీ ఆదేశిస్తే తాను జాతీయ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమేనని ప్రియాంక గాంధీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం అమేథీలో పర్యటించిన ప్రియాంక,  2022 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని  కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారా? ఈ ఎన్నికలు కాదు. 2022 ఎన్నికలకు (యూపీ అసెంబ్లీ ఎన్నికలు) ఆ ఎన్నికలకు మీరు తీవ్రంగా కష్టపడాలంటూ  ఆమె  పార్టీ శ్రేణులను కోరారు.

మరిన్ని వార్తలు