నెహ్రూజీ అలా చేశారట: ప్రియాంక గాంధీ

14 Nov, 2019 13:30 IST|Sakshi

న్యూఢిల్లీ: బాలల దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన ముత్తాత, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు సంబంధించిన మధుర ఙ్ఞాపకాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. తన చిన్నతనంలో నెహ్రూ గురించి విన్న కథను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘ మా ముత్తాత ప్రధానిగా ఉన్న సమయంలో ఓ రోజు వేకువజామున మూడు గంటలకు ఇంటికి వచ్చారట. ఎంతగానో అలసిపోయిన తన అంగరక్షకుడు ఆదమరచి తన పరుపు మీద నిద్రపోతున్న దృశ్యాన్ని చూశారట. వెంటనే తన చేతిలో ఉన్న బ్లాంకెట్ అతడికి కప్పి.. ఎదురుగా ఉన్న కుర్చీలో నిద్రపోయారట. కొన్నిసార్లు ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఓ వ్యక్తి గురించి మనకు పూర్తిగా అర్థమయ్యేలా చేస్తాయి’ అని ప్రియాంక నెహ్రూ వ్యక్తిత్వం గురించి తన పోస్టులో రాసుకొచ్చారు.

కాగా చాచా నెహ్రూగా చిన్న పిల్లల అభిమానం చూరగొన్న జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతీ ఏటా నవంబరు14ను బాలల దినోత్సవంగా జరుపుకొంటారన్న విషయం తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం సందర్భంగా ఎంతో మంది చిన్నారులు నెహ్రూ మాదిరి వేషం ధరించి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయనను గుర్తుచేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు