చిన్ననాటి ఫొటో పంచుకున్న ప్రియాంకగాంధీ

19 Nov, 2019 18:16 IST|Sakshi

మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ 102వ జయంతి సందర్భంగా యావత్‌ దేశం ఘనంగా నివాళి అర్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. కాగా, కాంగ్రెస్‌ నేత ప్రియాంకగాంధీ వినూత్నంగా ఓ కవితతో నివాళి అర్పించారు. నాయనమ్మ ఇందిరా గాంధీతో తనకున్న అనుబంధాన్ని సూచించే ఫొటోను సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

ఇందులో ఇందిరా గాంధీ.. ప్రియాంక చేతులు పట్టుకుని ఆడిస్తూ నవ్వులు చిందిస్తున్నారు. తన నాయనమ్మ ఇందిరా గాంధీ అ‍త్యంత ధైర్యవంతురాలిగా ఆమె కొనియాడారు. ‘క్లిష్ట పరిస్థితుల్లో నేను ఏడుస్తూ కూర్చోలేదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాను.. నెత్తుటి మరకలనూ సహించానే తప్ప కుంగిపోలేదు’ అన్న ప్రముఖ ఇంగ్లిష్ పద్యాన్ని ఆమెకు అంకితం చేశారు

భారత మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1917 నవంబర్‌ 19న జన్మించారు. 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు భారత ప్రధానిగా తన సేవలను అందించారు. అనంతరం 1980 జనవరి నుంచి 1984 అక్టోబర్‌ వరకు మళ్లీ ప్రధాని బాధ్యతలను చేపట్టారు. అనతి కాలంలోనే ప్రపంచం గుర్తించదగ్గ నేతల్లో ఒకరిగా ఖ్యాతి గడించారు. 1984 అక్టోబర్‌ 31న ఆమె వ్యక్తిగత బాడీగార్డు చేతిలో హత్యకు గురయ్యారు.

మరిన్ని వార్తలు