‘జమ్మూ కశ్మీర్‌ హక్కులు కాలరాయటం దేశ ద్రోహమే’

26 Aug, 2019 13:26 IST|Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా కేంద్ర సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాయటం కంటే రాజకీయ, దేశ ద్రోహం మరొకటి ఉండదు’ అని తన ట్విటర్‌లో ఖాతాలో పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కశ్మీర్‌ లోయలో నెలకొన్న పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ సహా పలువురు విపక్ష నేతలు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారు విమానంలో తిరిగి వస్తున్న సమయం‍లో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన ఓ వీడియోను ప్రియాంక ట్వీట్‌ చేశారు. ఆ వీడియోలలో విమానంలో ప్రయాణించే ఓ జర్నలిస్టు.. విషాదంతో శ్రీనగర్‌లో తను ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాహుల్‌ గాంధీకి చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌..  కశ్మీర్‌ పరిస్థితులు చాలా ప్రశాంతంగా ఉన్నాయంటూ.. కావాలంటే రాహుల్‌ గాంధీ కశ్మీర్‌ పరిస్థితులను తెలుకోవడానికి వస్తే, తాను ప్రత్యేక విమానం పంపిస్తానని ట్విటర్‌ వేదికగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందుకు స్పందించిన రాహుల్‌.. గవర్నర్‌ పంపే విమానం తనకు ఏమాత్రం అవసరం లేదంటూ.. ఆయన ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ కశ్మీర్‌ను పర్యటించిన కొద్దిగంటల్లో అక్కడి  సమాచార, ప్రజా సంబంధ శాఖ..కశ్మీర్‌ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించే ఎటువంటి రాజకీయ నాయకులు శ్రీనగర్‌ పర్యటనకు రావద్దు. దేశ సరిహద్దు ఉగ్రవాదం నుంచి కశ్మీర్‌ ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది’ అని ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. అయినప్పటికీ విపక్ష బృందం కశ్మీర్‌ పర్యటనకు వెళ్లగా వారిని వెనక్కి పంపారు.

>
మరిన్ని వార్తలు