నా రక్షణ సంగతేంటి?

1 Dec, 2019 03:27 IST|Sakshi

పార్లమెంటు ముందు గళమెత్తిన ఓ యువతి 

సాక్షి, న్యూఢిల్లీ: ప్రియాంకారెడ్డి హత్యపై పార్లమెంటు వద్ద ఓ యువతి గళమెత్తింది. తన సొంత దేశంలో తనకు రక్షణ ఉన్న భావన కలగడం లేదని వాపోయింది. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల వార్తలు వినీ వినీ తాను అలసిపోయానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రియాంకకు ఎదురైన ఉదంతం తనకు ఎదురైతే పరిస్థితి ఏంటి? అంటూ కన్నీటిపర్యంతమైంది. ఈ దేశంలో తనకు ఉన్న రక్షణ ఏంటి? అంటూ నిలదీసింది. ప్రియాంక హత్యపై ఢిల్లీకి చెందిన అను దూబే తీవ్ర కలత చెందింది. ఈ ఘటన తనకు ఎదురైతే పరిస్థితి ఏంటని ఊహించుకొని కుమిలిపోయింది. తన రక్షణపై పాలకులను ప్రశ్నిస్తూ శనివారం ఉదయం 7 గంటలకే పార్లమెంటు వద్ద తనొక్కటే నిరసనకు దిగింది. దేశంలో తనకు ఉన్న రక్షణ ఏంటి అంటూ ప్రశ్నిస్తూ ప్లకార్డు పట్టుకొని కూర్చుంది. 

పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక మరోసారి ఈ దేశంలో ఇలాంటి ఘటనలు చూసేందుకు తాను సిద్ధంగా లేనంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆ యువతి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. చివరికి పోలీసులు ఆమెను బలవంతంగా పార్లమెంటు స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాగా, అను దూబేను పోలీసులు అడ్డుకున్న తీరును ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ తీవ్రంగా ఆక్షేపించారు. దూబేతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుని దూబేకు సంఘీభావం తెలిపారు. 

ఢిల్లీలో ఆందోళనలు.. 
ప్రియాంకారెడ్డి హత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. యువ వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేయడంపై యావత్తు దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రియాంక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. దోషులను ఉరితీయాలంటూ శనివారం పార్లమెంటు స్ట్రీట్‌ వద్ద ఆందోళన బాటపట్టాయి.

చదవండి:
ముందే దొరికినా వదిలేశారు!

28 నిమిషాల్లోనే చంపేశారు!

>
మరిన్ని వార్తలు