‘పింక్‌ ఆర్మీ’పై సెటైర్స్‌

12 Feb, 2019 13:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :
‘దేశ్‌ కే సమ్మాన్‌ మే
ప్రియాంక జీ మైదాన్‌ మే
మాన్‌ బీ దేంగే
సమ్మాన్‌ బీ దేంగే
వక్త్‌ పడేగా తో జాన్‌ బీ దేంగే’

(దేశ గౌరవార్థం, ప్రియాంక గాంధీ మైదాన్‌లో ఉంటే ఆమెను హృదయపూర్వకంగా గౌరవిస్తాం. అవసరమైతే మా ప్రాణాలనైనా ఇస్తాం) అన్న నినాదం రాసిన గులాబీ రంగు టీ షర్టులు, అదే రంగు పాయింట్లు ధరించిన ‘ప్రియాంక సేన’ సోమవారం నాడు ఉత్తరప్రదేశ్‌లో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ నిర్వహించిన రోడ్డు షోలో హల్‌చల్‌ చేశారు. వారి టీ షర్టులపై ప్రియాంక గాంధీ ఫొటోను కూడా ముద్రించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 500 మంది కార్యకర్తలు ఇలా దుస్తులు ధరించి రోడ్డు షోలో దారి పొడువున ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై పోరాటానికి గులాబీ రంగు చిహ్నమని, ఒక్క యూపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా మహిళలకు వ్యతిరేకంగా జరగుతున్న అన్యాయాలను అంతం చేయడం కోసం ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారని, ఆమె పోరాటం ఒక్క యూపీకే పరిమితం కాదని ప్రియాంక సేన సభ్యులు తెలిపారు.

సోషల్‌ మీడియాలో మాత్రం వీరుపై హాస్యోక్తులు వెల్లువెత్తాయి. మహిళలపై జరిగే అన్యాయాలపై పోరాటానికి చిహ్నం గులాబీ రంగయితే పురుషులపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేక పోరాటానికి నీలి రంగు చిహ్న మవుతుందా? అని ఒకరు, కాంగ్రెస్‌ పార్టీలోని జెండా రంగుల్లా త్రివర్ణ యూనిఫామ్‌లు ధరిస్తే బాగుండేదని మరొకరు వ్యాఖ్యానించారు. కడుపులో ఎసిడిటి మంటను తగ్గించే ‘జెలుసిల్‌’ రంగులా ఉన్నారని ఒకరు, ఓ దున్నపోతుకు రంగేసి ‘అచ్చం ఇలా ఉన్నారు బాసు!’ అంటు మరొకరు కామెంట్‌ చేశారు. విమర్శలు చేసిన వారిలో ఎక్కువ మంది బీజేపీ కార్యకర్తలే ఉన్నారు.

మరిన్ని వార్తలు