షాకింగ్ విషయాలు చెప్పిన పన్నీర్ సెల్వం

27 Jan, 2017 17:22 IST|Sakshi
షాకింగ్ విషయాలు చెప్పిన పన్నీర్ సెల్వం

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం షాకింగ్ విషయాలు చెప్పారు. మొన్న జరిగిన జల్లికట్టు ఉద్యమంలో కొందరు తమిళులు ప్రత్యేక తమిళదేశం కావాలని డిమాండ్ చేశారని, నిరసనకారులు ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఫొటోలు కూడా చూపించారని వివరించారు. శుక్రవారం తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సెల్వం మాట్లాడుతూ మెరినా బీచ్ తో జల్లికట్టుకోసం జరిగిన ఆందోళనలో కొంతమంది అల్ కాయిదా ఉగ్రవాది లాడెన్ ఫొటో చూపించారని తెలిపారు.

అలాగే, గణతంత్ర దినోత్సవాన్ని కూడా బహిష్కరించాలని డిమాండ్ చేసినట్లు ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. జల్లికట్టు ఉద్యమం ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు పోలీసు బలగాలను ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ఈ సమాధానం చెప్పారు. కొన్ని సామాజిక వ్యతిరేక శక్తులు జల్లికట్టు ఉద్యమంలో చేరాయి.

పరిష్కారం చూపిన తర్వాత కూడా రిపబ్లిక్ డే వరకు ఉద్యమం చేద్దాం అని కొందరు రెచ్చగొడుతుంటే అప్పుడు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయం నేను ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను. కొన్ని గ్రూపులు కావాలనే నల్లజెండాలు పనిగట్టుకొని ప్రదర్శించాయని, వారిని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు చెప్పారు. అయితే, ఆరోజు జరిగిన హింసపై జ్యుడిషియల్ దర్యాప్తు చేయించాలని స్టాలిన్ డిమాండ్ చేయగా ప్రభుత్వం నిరాకరించడంతో వారు వాకౌట్ చేశారు.

మరిన్ని వార్తలు