‘ఇంద్రాణిని ఒకసారి తీసుకురండి’

27 Jun, 2017 20:13 IST|Sakshi
‘ఇంద్రాణిని ఒకసారి తీసుకురండి’
ముంబయి: కూతురుని హత్య చేయించిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియాను తమ ముందు హాజరుపరచాలని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం బైకుల్లా జైలు అధికారులను ఆదేశించింది. బుధవారం ఆమెను కోర్టుకు తీసుకురావాలని చెప్పింది. బైకుల్లా జైలులో జరిగిన అల్లర్లలో ఇంద్రాణిని జైలు సిబ్బంది వేధించారని, ఆమె ఒంటిపై, తలకు గాయాలు కూడా అయ్యాయని పేర్కొంటూ ఆమె తరుపు న్యాయవాది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

జైలులో తాజాగా లైంగిక వేధింపుల ఘటన చోటు చేసుకొని తోటి ఖైదీ మరణించడంతో తానిప్పుడు భయపడుతున్నానని, జైలులో తీవ్ర హింస జరుగుతుందని కూడా కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. మెదడుకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్న ఇంద్రాణికి ఏదైనా జరగరానిది జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని కూడా అందులో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారు చేస్తున్న ఆరోపణలు నిజమోకాదో తెలుసుకునేందుకు కోర్టుకు తీసుకురావాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
మరిన్ని వార్తలు