అసిఫా కుటుంబానికి రక్షణ ఇవ్వండి

17 Apr, 2018 02:22 IST|Sakshi
అసిఫా హత్యాచారం కేసు నిందితులను సోమవారం కఠువా జిల్లా కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు

జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

క్రైం బ్రాంచ్‌ దర్యాప్తుపై బాధితురాలి తండ్రి సంతృప్తి

తినార్కో పరీక్షలకు నిందితుల డిమాండ్‌

న్యూఢిల్లీ/కఠువా: కఠువాలో సామూహిక అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి అసిఫా కుటుంబానికి, ఈ కేసులో బాధితులకు సాయపడుతున్న న్యాయవాదితో పాటు వారి కుటుంబ స్నేహితుడికి రక్షణ కల్పించాలని జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే కేసు విచారణను కఠువా నుంచి చండీగఢ్‌ మార్చాలన్న బాధితురాలి తండ్రి పిటిషన్‌ను కూడా సుప్రీం సోమవారం పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలని కశ్మీర్‌ ప్రభుత్వానికి సూచించింది.

ఈ కేసులో జమ్మూ కశ్మీర్‌ పోలీసుల దర్యాప్తు పట్ల తాను సంతృప్తిగా ఉన్నానని బాధితురాలి తండ్రి సుప్రీంకు వెల్లడించడంతో పాటు, సీబీఐ విచారణను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. ‘ఈ స్థితిలో కేసును సీబీఐకి బదిలీ చేసే అంశంపై జోక్యం చేసుకునే ఉద్దేశ్యం మాకు లేదు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పేర్కొంది.

‘బాధితురాలి కుటుంబానికి, న్యాయవాది దీపక్‌ సింగ్‌ రజావత్, కుటుంబ స్నేహితుడు తలిద్‌ హుస్సేన్‌కు భద్రతను పెంచాలని జమ్మూ కశ్మీర్‌ పోలీసులను ఆదేశిస్తున్నాం. జమ్మూలో మతపరమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశమున్న నేపథ్యంలో కేసు విచారణను బదిలీ చేసే అంశంపై ఏప్రిల్‌ 27లోగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుతో సంబంధమున్న మైనర్‌కు తగిన భద్రత కల్పించాలనీ ఆదేశించింది. కేసుతో సంబంధమున్న వారి పిటిషన్లను మాత్రమే విచారిస్తామంది. సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ప్రస్తావించిన పిటిషన్లను విచారించేందుకు అంగీకరించింది.

విధులకు హాజరైన జమ్మూ న్యాయవాదులు
కఠువా కేసును సీబీఐకి అప్పగించాలని కోరడంతో పాటు పలు డిమాండ్లతో 12 రోజులుగా విధులు బహిష్కరించిన జమ్మూ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు సోమవారం విధుల్లో చేరారు. బార్‌ అసోషియేషన్‌ సమావేశంలో నిర్ణయం అనంతరం వారు కోర్టుకు హాజరయ్యారు.

సీబీఐకి అప్పగించండి: నిందితులు
తాము ఎలాంటి తప్పు చేయలే దని, తమకు నార్కో ఎనాలిసిస్‌ పరీక్షలు నిర్వహించాలని కఠువా కేసులోని 8మంది నిందితులు కఠువా డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు జడ్జికి విజ్ఞప్తి చేశారు. విచారణ నిమిత్తం సోమవారం వారిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. నిందితుల తరఫు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు.. చార్జిషీట్‌ కాపీలు సమర్పిం చాలని పోలీసుల్ని జడ్జి ఆదేశించారు. అనంతరం విచారణను ఏప్రిల్‌ 28కు వాయిదావేశారు.  మరోవైపు విచారణ జరుగుతుండగా.. ప్రధాన నిందితుడు సంజీరామ్‌ కుమార్తె మధు శర్మ సీబీఐ దర్యాప్తు కోరుతూ కోర్టు బయట ఆందోళన నిర్వహించింది.
 

>
మరిన్ని వార్తలు