పౌరసత్వ రగడ: పోలీసుల అదుపులో ప్రముఖులు

19 Dec, 2019 12:45 IST|Sakshi

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. అలాగే భారీగా పోలీసులను మోహరించారు. అయినప్పటికీ నిరసనకారులు, పలువురు ప్రముఖలు రోడ్లపైకి వచ్చి సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్దకు నిరసకారులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది నిరసకారులను పోలీసులు అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న స్వరాజ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తనను తీసుకెళ్లే సమయంలో ‘భారత్‌ మాతా కీ జై’ అంటూ యోగేంద్ర యాదవ్‌ నినాదాలు చేశారు. 

సీఏఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో పోలీసులు ఢిల్లీ-గురుగ్రామ్‌ హైవేపై బారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. దీంతో 5 కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అలాగే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడంతో పాటు..16 మెట్రో స్టేషన్‌ల గేట్లను మూసివేశారు. మరోవైపు బెంగళూరు టౌన్‌ హాల్‌ సమీపంలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఏఏపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉండగానే పోలీసులు లాక్కుని వెళ్లారు. 

సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణలోని చార్మినార్‌ వద్ద ఆందోళన చేపట్టిన పలువురు నిరసనకారులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు