పౌరసత్వ బిల్లుపై నిరసనలు.. టీవీ చానళ్లకు హెచ్చరిక

12 Dec, 2019 15:36 IST|Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందండంతో ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రైవేటు శాటిలైట్‌ టీవీ చానళ్లకు కీలక సూచనలు చేసింది. హింసను ప్రేరేపించేలా, దేశ వ్యతిరేక వైఖరిని ప్రోత్సహించేలా, దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న దృశ్యాలను ప్రసారం చేయవద్దని హెచ్చరించింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఘర్షణల దృశ్యాలను కొన్ని టీవీ చానళ్లు ప్రసారం చేయడంతో సమాచార, ప్రసార శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ 1995 నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అంశాలను ప్రసారం చేయరాదని స్పష్టం చేసింది. హింసను ప్రేరేపించే అంశాలను ప్రసారం చేయకుండా అన్ని చానళ్లు అప్రమత్తతో ఉండాలని, దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని మంత్రిత్వ శాఖ కోరింది. గతంలో కూడా పలుమార్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ టీవీ చానళ్లపై అంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు