అట్టుడుకుతున్న కర్ణాటక!

20 Mar, 2015 04:16 IST|Sakshi
డీకే రవి

బెంగళూరు/న్యూఢిల్లీ :  యువ ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతిపై కర్ణాటక వ్యాప్తంగా నిరసన సెగలు చెలరేగుతున్నాయి. ఈ కేసు దర్యాప్తును కర్ణాటక ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. సీఐడీ విచారణతో వాస్తవాలు బయటకు వస్తాయన్న నమ్మకం తమకు లేదని, అందువల్ల విచారణను సీబీఐకి అప్పగించాలని విపక్షాలతో పాటు డీకే రవి తల్లిదండ్రులు, రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌తో విపక్షాలు కర్ణాటక ఉభయసభల్లో గురువారం నిరసనకు దిగాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని సీబీఐ దర్యాప్తునకు అంగీకరించే వరకు పట్టు వీడబోమని భీష్మించాయి. దీంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

బీజేపీ, జేడీఎస్ సభ్యులు విధానసౌధ నుంచి రాజ్‌భవన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. గవర్నర్ వాజుభాయ్ రుడాభాయ్ వాలాతో సమావేశమయ్యారు. ఈ కేసును సీబీఐకి అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.  విధానసౌధలో ఈ రో్జు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో  ఇద్దరు మంత్రులు మినహా మిగిలిన అందరూ  ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించారు.

కాగా, డీకే రవి తల్లిదండ్రులు, బంధువుల నుంచి వివరాలు తెలుసుకునేందుకు ఆయన స్వగ్రామం తుమకూరు జిల్లా కునిగళ్ దొడ్డకుప్పలుకు వెళ్లిన సీఐడీ పోలీసులకు తీవ్ర నిరసన ఎదురైంది. సీఐడీ విచారణపై నమ్మకం లేనందున సీబీఐ అధికారులకు తప్పితే ఎవరికీ ఎలాంటి వివరాలు వెల్లడించబోమని రవి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం  మొండిపట్టు వీడటం లేదు. మంత్రి మండలి సమావేశం తర్వాత రాష్ట్ర హోంశాఖ మంత్రి కేజే జార్జ్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ సీబీఐకి అప్పగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఇదిలా ఉండగా, లోక్సభలో ఈ రోజు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానమిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఈ కేసును సీబీఐకి తాము సిద్ధంగానే ఉన్నట్లు తెలిపారు. డి.కె.రవి మృతికి సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీలు గురువారం సైతం తమ నిరసనను కొనసాగించారు. బీజేపీ ఎంపీ ప్రహ్లాద్‌జోషి లోక్‌సభలో ఈ విషయాన్ని  ప్రస్తావించారు. నిజాయితీ గల అధికారిగా ప్రజల మన్ననలు అందుకున్న రవి ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని ప్రహ్లాద్‌జోషి తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించిందని, అయితే సీఐడీ విచారణపై రవి తల్లిదండ్రులతో పాటు రాష్ట్ర ప్రజలందరిలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. అందుకే ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని ఈ కేసును సీబీఐకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ సమాధానమిస్తూ 'రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు మేం సిద్ధంగానే ఉన్నాం' అని చెప్పారు.

మరిన్ని వార్తలు