అట్టుడుకుతున్న అరుణాచల్‌

25 Feb, 2019 05:58 IST|Sakshi

ఎస్టీయేతరులకు పీఆర్సీపై రగడ  

 పోలీస్‌ కాల్పుల్లో ఇద్దరు మృతి 

ఇటానగర్‌: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎస్టీలు కాని ఆరు సామాజికవర్గాలకు శాశ్వత నివాస పత్రాలు(పీఆర్సీ) జారీచేయాలన్న హైపర్‌ కమిటీ సిఫార్సుతో ఆ రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఆదివారం చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రైవేటు నివాసంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అల్లరిమూకలు అధికారులపై రాళ్లవర్షం కురిపించాయి. దీంతో పోలీసులు కాల్పులు జరపగా, ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అంతకుముందు డిప్యూటీ సీఎం చౌనా మైన్‌ ఇంటిపై దాడిచేసి భవనానికి నిప్పుపెట్టారు.

అనంతరం డిప్యూటీ కమిషనర్‌ ఆఫీసుపై దాడిచేసి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. డిప్యూటీ కమిషనర్‌ ఆఫీసు ప్రాంగణంలోని వాహనాలకు నిప్పంటించారు. ఇటానగర్‌ పోలీస్‌స్టేషన్‌పై సైతం దాడిచేశారు. నహర్‌లగున్‌ జిల్లాలో మార్కెట్‌ కాంప్లెక్స్‌కు నిప్పుపెట్టడంతో పాటు  ఓ షాపింగ్‌మాల్‌ను లూటీ చేశారు. రాష్ట్రంలోని నమ్సాయి, చాంగ్‌లాంగ్‌ జిల్లాల్లో ఉంటున్న ఆరు ఎస్టీయేతర సామాజికవర్గాలకు పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సు చేసింది. కాగా, ఆందోళనల నేపథ్యంలో పీఆర్సీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని  సీఎస్‌ సత్యగోపాల్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు