భగ్గుమన్న ముంబై!

21 Jun, 2014 23:14 IST|Sakshi
భగ్గుమన్న ముంబై!

సాక్షి, ముంబై: రైల్వే చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నగరవ్యాప్తంగా శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. ఒక్క గంట రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినా ముంబై అతలాకుతలమవుతుంది. అంతగా రైళ్లపై ఆధారపడే ముంబైకర్లకు పెంపు నిర్ణయం మింగక తప్పని చేదు మాత్రగా మారింది. దీంతో పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలు, డబ్బావాలాలు, స్వచ్ఛంద సంస్థలు పెద్దపెట్టున ఆందోళనకు దిగాయి. రాస్తారోకోలు చేశాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
ఆర్థికభారం రెట్టింపు..
పెంచిన రైల్వే చార్జీలతో ముంబైకర్లపై ఆర్థిక భారం రెట్టింపు కానుంది. దాదాపుగా అన్నిరకాల టికెట్ చార్జీలు, పాస్ చార్జీల పెరిగిన తీరు పరిశీలిస్తే ప్రస్తుతం కంటే రెట్టింపయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వీటికితోడు త్వరలో ఆటో, ట్యాక్సీల చార్జీలు కూడా పెరగనున్నాయి. దీంతో ఇంట్లోనుంచి కాలు బయట పెట్టేముందే జేబు బరువగా ఉందా? లేదా? చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంచిన రైలు చార్జీలు 25 నుంచి అమలు కానుండడంతో నగరవాసులు ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా భారం భరించేందుకు సిద్ధమవుతున్నారు. 14.2 ప్రయాణ చార్జీలకు తోడు రవాణా చార్జీలను కూడా 6.5 శాతం పెంచుతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ నుంచి ప్రకటన వెలువడిన మరుక్షణమే నగరవాసుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తడం ప్రారంభమైంది.
 
వేతనాలు వందల్లో, ఖర్చులు వేలల్లో పెరుగుతున్నాయని, ఇన్నాళ్లూ అప్పుచేసి బతికిన తమకు ఇక కొత్త అప్పు ఎక్కడ చేయాలో కూడా తెలియని దుస్థితి దాపురించిందని నిర్మల అనే మహిళ వాపోయింది. ఇప్పటికే నిత్యావసరాలు వెక్కిరిస్తున్నాయని, ఇక ఇంధన ధరలకైతే హద్దూఅదుపూ లేకుండా పోయిందని, దీంతో ఆటో, ట్యాక్సీల చార్జీలు కూడా పెరిగాయని, త్వరలో మరింత పెరగనున్నట్లు తెలుస్తోందని, కాస్త తక్కువగా ఉన్నాయనకున్న రైలు చార్జీలు కూడా పెంచేసి ఓటు వేసినందుకు కేంద్ర ప్రభుత్వం సరైన గుణపాఠమే చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
సీజన్ పాస్‌ను రెట్టింపు చేయగా త్వరలో ఆటో, ట్యాక్సీల ధరలు రూ. 2 పెంచనున్నారు. హైకోర్టు నుంచి అనుమతి రావడమే ఆలస్యం.. ఆటో, ట్యాక్సీల ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. పెంచిన రైల్వే చార్జీలతో ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేకు అదనంగా రూ.8,000 కోట్ల ఆదాయం చేకూరనుంది. దేశ ఆర్థిక పురోభివృద్ధి జరగాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. చార్జీలను పెంచే ప్రక్రియను వారం రోజులకు ముందుగానే నిర్ణయించినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అయితే నగర లైఫ్‌లైన్లు అయిన లోకల్ రైళ్లను రోజుకు దాదాపు 75 లక్షల మంది ప్రయాణికులు ఆశ్రయిస్తుంటారు. వీరంతా ఈ పెరిగిన భారాన్ని మోయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
 
సబర్బన్ రైళ్లను ఆశ్రయించి సీజన్ టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికులకు ప్రయాణభారం మరింత అధికం కానుంది. నెలసరి, క్వార్టర్లీ పాస్ చార్జీలను కూడా 100 శాతం పెంచారు. ఇదిలా వుండగా చర్చిగేట్ నుంచి విరార్ వరకు ‘సెకండ్ క్లాస్ నెలసరి సీజన్’ టికెట్లు ప్రస్తుతం రూ.280 ఉండగా రూ.645కు పెంచనున్నారు. ఇదే దూరంలో ఫస్ట్‌క్లాస్ నెలసరి సీజన్ టికెట్‌ను రూ.1,035 నుంచి రూ.1,960 వరకు పెంచనున్నారు. దీంతో నగరవాసుల ప్రయా ణ వ్యయం రెట్టింపు అయిందని చెబుతున్నారు.
 లోకల్‌రైల్ సీజన్ టికెట్ చార్జీలు రూ.లలో
 
సెకెండ్ క్లాస్    ఫస్ట్ క్లాస్

చర్చ్‌గేట్-బోరివలి    190    480    655    1310
 చర్చ్‌గేట్-విరార్    280    645    1,035    1,960
 సీఎస్టీ-ఠాణే    190    480    655    1,310
 సీఎస్టీ-పన్వెల్    335    720    1,035    1,960

మరిన్ని వార్తలు