అది ముస్లిం సంస్థల పనే

23 Dec, 2019 02:04 IST|Sakshi
జైపూర్‌లో రాజస్తాన్‌ సీఎం గహ్లోత్‌ నేతృత్వంలో జరిగిన ర్యాలీకి భారీగా హాజరైన జనం

‘పౌర’ అల్లర్ల వెనుక పీఎఫ్‌ఐ, సిమి ప్రమేయం: యూపీ సర్కార్‌

లక్నో విమానాశ్రయంలో టీఎంసీ నేతల అడ్డగింత

‘పౌర’ చట్టం, ఎన్నార్సీలపై జైపూర్‌లో భారీ ర్యాలీ

న్యూఢిల్లీ/లక్నో/మంగళూరు/జైపూర్‌: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో బయటివారి ప్రమేయం ఉందని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆరోపించింది. ఈ అల్లర్లలో పాలుపంచుకున్న ఇస్లామిక్‌ సంస్థలకు చెందిన ఆరుగురు పశ్చిమబెంగాల్‌ కార్యకర్తలను అరెస్ట్‌ చేసినట్లు  ప్రకటించింది. ‘పౌర’ చట్టాన్ని నిరసిస్తూ ఉత్తరప్రదేశ్‌లో మూడు రోజులపాటు జరిగిన హింసాత్మక ఘటనల్లో 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

రాజధాని లక్నోతోపాటు గొడవలు ఎక్కువగా చోటుచేసుకున్న మీరట్, ఫిరోజాబాద్, కాన్పూర్, బిజ్నోర్‌ తదితర ప్రాంతాల్లో ఆదివారం ప్రశాంతత నెలకొంది. కాగా, అల్లర్ల బాధిత కుటుంబాలను కలిసేందుకు వచ్చిన బెంగాల్‌ అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) నేతలను లక్నో విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. బిజ్నోర్‌ జిల్లాలో అల్లర్ల బాధిత కుటుంబాలను కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ పరామర్శించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ‘పౌర’ చట్టానికి అనుకూలంగా జరిగిన ర్యాలీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు.

అల్లర్ల కారకులను అరెస్ట్‌ చేశాం
రాష్ట్రంలో అల్లర్లకు కారకులైన వారిని గుర్తించి అరెస్ట్‌ చేసినట్లు ఆదివారం డిప్యూటీ సీఎం దినేశ్‌ శర్మ మీడియాకు తెలిపారు. హింసాత్మక ఘటనల వెనుక పశ్చిమబెంగాల్‌కు చెందిన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ), స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి) కార్యకర్తల హస్తం ఉందన్నారు. వీరు అక్రమ ఆయుధాలను వాడారని తెలిపారు. బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు చెందిన ఆరుగురు పీఎఫ్‌ఐకు చెందిన వారిని ఇప్పటికే అరెస్ట్‌ చేశామన్నారు.

జైపూర్‌లో భారీ ర్యాలీ
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఆధ్వర్యంలో జైపూర్‌లో భారీ ర్యాలీ జరిగింది.  ఈ ర్యాలీలో 3 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. ఆదివారం ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, బిహార్, రాజస్తాన్, తమిళనాడు ల్లోనూ ఆందోళనలు ప్రశాంతంగా కొన సాగాయి.  ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు ఆదివారం దేశ రాజధానిలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన తెలిపారు. తమ ప్రాంత స్థానిక ప్రజల హక్కుల కోసం జరుగుతున్న పోరాటాన్ని మరుగున పరిచేలా, ‘పౌర’ ఆందోళన లకు మతం రంగు పులిమారని వారు ఆరోపించారు. ‘మా అజెండాను వేరొకరు హైజాక్‌ చేయనివ్వం. మా ప్రజల తరపున మాట్లాడేందుకే ఇక్కడికి వచ్చాం’అని త్రిపుర రాచ కుటుంబ వారసుడు ప్రద్యోత్‌ దేవ్‌ వర్మన్‌ పేర్కొన్నారు.

నాగపూర్‌లో అనుకూల ర్యాలీ
నాగపూర్‌: పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ చట్టానికి అనుకూలంగా ఆదివారం నాగపూర్‌లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూల సంస్థ చేపట్టిన ర్యాలీలో గడ్కరీ ప్రసంగించారు. ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలకు ఎటువంటి అన్యాయం తలపెట్టదన్నారు. పొరుగు దేశాల నుంచి వచ్చిన వారిని వెనక్కి పంపబోదన్నారు. ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందన్న విషయం ముస్లింలు గ్రహించాలన్నారు. 

మరిన్ని వార్తలు