‘పౌరసత్వం’పై మంటలు

15 Dec, 2019 01:30 IST|Sakshi
పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో బస్సులకు నిప్పుపెట్టి ఆందోళనకు దిగిన నిరసనకారులు

బెంగాల్‌లో రైల్వే స్టేషన్‌కు, పలు బస్సులకు నిప్పు

అస్సాంలో మంటల్లో ఆయిల్‌ ట్యాంకర్‌..డ్రైవర్‌ మృతి

ఈశాన్య రాష్ట్రాల్లో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

గువాహటి/కోల్‌కతా: సవరించిన పౌరసత్వ చట్టంపై అస్సాం, పశ్చిమబెంగాల్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం బెంగాల్‌లో ఆందోళనకారులు రైల్వే స్టేషన్‌కు, బస్సులకు నిప్పుపెట్టారు. అస్సాంలోని సోనిపట్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి ఆయిల్‌ ట్యాంకర్‌కు నిప్పుపెట్టడంతో అందులోని డ్రైవర్‌ మృతి చెందాడు. పౌరసత్వ చట్ట సవరణను రద్దు చేయాలంటూ ఈనెల 18వ తేదీన విధులు బహిష్కరించనున్నట్లు అస్సాం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించింది.

పౌరసత్వ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమంటూ దీనికి నిరసనగా ఈ నెల 21వ తేదీన బిహార్‌ బంద్‌ పాటించాలని ఆర్‌జేడీ పార్టీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. ఆందోళనల నేపథ్యంలో జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ఈనెల 16 నుంచి జనవరి 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. పలు పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇలా ఉండగా, అస్సాంలోని డిబ్రూగఢ్, గువాహటిలతోపాటు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో అధికారులు శనివారం కర్ఫ్యూను సడలించారు. వదంతులు వ్యాపించకుండా అస్సాంలో ఇంటర్నెట్‌ సేవలపై నిషేధాన్ని ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించారు.

మంటల్లో రైల్వే స్టేషన్, బస్సులు
బెంగాల్‌లో రెండో రోజూ ఉద్రిక్తతలు కొనసాగాయి. ముర్షీదాబాద్, ఉత్తర 24 పరగణాల జిల్లాలు, హౌరా గ్రామీణ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్‌కు, బస్సులకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. హౌరా– ముంబై, ఢిల్లీ–కోల్‌కతా హైవేపై రెచ్చిపోయిన ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు చెందిన 15 బస్సులకు నిప్పుపెట్టడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బగ్నాన్‌లో 20 దుకాణాలు లూటీకి గురయ్యాయి. వందలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులు శనివారం మధ్యాహ్నం సంక్రాయిల్‌ రైల్వే స్టేషన్‌ కాంప్లెక్స్‌కు నిప్పుపెట్టారు. పట్టాలపై బైఠాయించడంతో సెల్డా–హస్నాబాద్, షొండాలియా–కాక్రా మిర్జాపూర్, హౌరా–ఖరగ్‌పూర్‌ సెక్షన్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ పరిస్థితుల్లో ఈశాన్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.  

అస్సాంలో మరొకరు మృతి
అస్సాంలో శనివారం వివిధ సంఘాలు, సంస్థల ఆందోళనల కారణంగా రైళ్ల రాకపోకలు, రవాణా వ్యవస్థ స్తంభించాయి. విద్యాసంస్థలు, కార్యాలయాలు పనిచేయలేదు. సోనిపట్‌ జిల్లా ధెకియాజులి వద్ద శుక్రవారం రాత్రి ఖాళీ ఆయిల్‌ ట్యాంకర్‌కు ప్రజలు నిప్పుపెట్టడంతో అందులోని ట్యాంకర్‌ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం ఉదయం అతడు ఆస్పత్రిలో కన్నుమూశాడని పోలీసులు తెలిపారు. గురువారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందిన విషయం తెలిసిందే.

తాజా ఘటనతో రాష్ట్రంలో ఆందోళనల్లో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది.  కామాఖ్య రైల్వే స్టేషన్‌కు దిగ్బంధించడంతో దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి గువాహటి రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నెల 16వ తేదీ నుంచి మూడు రోజులపాటు సత్యాగ్రహం పాటించాలని ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌ పిలుపునిచ్చింది. ఆందోళనలకు మద్దతుగా ఈనెల 18వ తేదీన విధులు బహిష్కరించనున్నట్లు అస్సాం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఎస్‌ఏకేపీ) అధ్యక్షుడు వాసవ్‌ కలిటా వెల్లడించారు. 16వ తేదీ నుంచి జరిగే సత్యాగ్రహ నిరసనలకు కూడా ఆయన మద్దతు ప్రకటించారు.

తమ పౌరులకు అమెరికా, బ్రిటన్‌ హెచ్చరిక
వాషింగ్టన్‌/లండన్‌: ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం.. రవాణా వ్యవస్థకు అంతరాయం.. కొనసాగుతున్న ఆందోళనలు.. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అమెరికా, బ్రిటన్‌తోపాటు కెనడా, సింగపూర్, ఇజ్రాయెల్‌ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఆందోళనలకు కేంద్ర బిందువుగా ఉన్న అస్సాంలో అధికార పర్యటనలను అమెరికా తాత్కాలికంగా రద్దు చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న తమ పౌరులకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పలు సూచనలు చేసింది. ఆందోళనలు, అస్థిర పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలకు వెళ్లవద్దని, సాధ్యమైనంత వరకు జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో సంచరించవద్దని, చుట్టుపక్కల జరిగే పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లరాదని బ్రిటన్, కెనడా, ఇజ్రాయెల్‌ తమ దేశస్తులను హెచ్చరించాయి.

>
మరిన్ని వార్తలు