కరుణానిధి అంత్యక్రియలు.. ప్రోటోకాల్‌ కిరికిరి

8 Aug, 2018 10:25 IST|Sakshi

సాక్షి, చెన్నై:  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియల వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టులో వాడివేడి వాదనలు కొనసాగుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే డీఎంకే పిటిషన్‌ దాఖలు చేసిందని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించగా.. బీచ్‌లోనే అంత్యక్రియలకు అనుమతించాలని  డీఎంకే తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఒకానోక తరుణంలో కోర్టు హాల్‌లో గందరగోళం నెలకొంది.

ప్రభుత్వ న్యాయవాది.. ‘గతంలో జానకీ రామచంద్రన్‌(ఎంజీఆర్‌ భార్య, మాజీ సీఎం కూడా) అంత్యక్రియలకు సీఎం కరుణానిధి మెరీనా బీచ్‌లో అనుమతించలేదు. ప్రోట్‌కాల్‌(సీఎం పదవిలో ఉండి చనిపోయిన వాళ్లకు మాత్రమే మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించటం)ను చూపించి అప్పుడు ఆయన అడ్డుకున్నారు. మాజీ సీఎంలకు గాంధీ మండపంలోనే స్మారకాలకు అనుమతి ఉంది.  కామరాజ్‌, భక్తవత్సలం, రాజాజీల అంత్యక్రియలకు గాంధీ మండపంలోనే స్థలం కేటాయించారు. ఇదంతా ప్రోటోకాల్‌ ప్రకారమే జరిగింది. ఇప్పుడు పొలిటికల్‌ ఎజెండా తోనే డీఎంకే కేసు వేసింది. ద్రవిడ ఉద్యమనేత పెరియార్‌ లాంటి వాళ్లకే మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు గౌరవం దక్కలేదన్న విషయం వారు గుర్తించాలి. రాత్రికి రాత్రే మేనేజ్‌ చేయించి డీఎంకే వాళ్లు ఐదు పిటిషన్లను ఉపసంహరించుకునేలా చేశారు’ అని వాదనలు వినిపించారు. 

డీఎంకే న్యాయవాది.. ‘ప్రభుత్వ వాదనలు అసంబద్ధంగా ఉన్నాయి. సిట్టింగ్‌ సీఎంల అంత్యక్రియలకు మాత్రమే మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించాలన్న నిబంధన ఎక్కడా లేదు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోవాలి. లేకుంటే వారి మనోభావాలు దెబ్బతింటాయి. అన్నాదురైని తన ఆత్మ, జీవితంగా కరుణానిధి గతంలో పేర్కొనేవారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఓ వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా?.. అటువంటి నేతకు గాంధీ మండపంలో అంత్యక్రియలు నిర్వహించటం సముచితం కాదు. పైగా మేనేజ్‌ చేశారంటూ వాదిస్తారా? అంటూ ప్రభుత్వ న్యాయవాదిపై డీఎంకే న్యాయవాది ఆ​గ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో కోర్టు హాల్‌లో గందరగోళం చెలరేగగా..  సైలెంట్‌గా ఉండాలని ప్రధాన న్యాయమూర్తి అందరికీ సూచించారు. సంతాప దినాలు కావటంతో కోర్టుకు సెలవు అయినప్పటికీ.. ఈ పిటిషన్‌ కోసమే బెంచ్‌ ప్రత్యేకంగా విచారణ చేపట్టడం గమనార్హం.

మరిన్ని వార్తలు