మత మార్పిడులను ప్రోత్సహించొద్దు

21 Dec, 2014 02:52 IST|Sakshi
  • ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్
  • కోల్‌కతా: మత మార్పిడులకు వ్యతిరేకంగా సంఘ్ పరివార్ ప్రచారం నిర్వహించటాన్ని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ గట్టిగా సమర్థించారు. మత మార్పిడుల నిరోధక బిల్లుకు మద్దతివ్వాలని విపక్షాలను డిమాండ్ చేశారు. హిందువులను బలవంతంగా మతం మార్చవద్దని మైనార్టీలకు సూచించారు. బలమైన హిందూ సమాజం నిర్మాణం కోసం తాము కృషి చేస్తున్నటు చెప్పారు.

    ఇతర మతాలకు మళ్లిన హిందువులంతా ఇష్టప్రకారం కాకుండా బలవంతంగా, ప్రలోభాలతో మతం మార్చుకున్నారని చెప్పారు. శనివారమిక్కడ ఆయన హిందూ సమ్మేళన్‌లో మాట్లాడారు. హిందూమతంలోకి మార్పిడులను వ్యతిరేకించే వారు హిందువులను కూడా ఇతర మతాల్లోకి మార్చవద్దని డిమాండ్ చేశారు.

    హిందూమతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారంతా తిరిగి హిందూ మతాన్ని స్వీకరించాలంటూ ఉత్తరాదిలో సంఘ్ పరివార్ చేపట్టిన ‘ఘర్ వాపసీ’ కార్యక్రమం వివాదాస్పదమైన నేపథ్యంలో  ఈ వ్యాఖ్యలు చేశారు.  ఇతరులను అణగదొక్కటంపై హిందూ సమాజానికి నమ్మకం లేదన్నారు. నూరు తప్పుల తరువాత ఇక ఉపేక్షించవద్దని భగవంతుడు సైతం చెప్పాడని గుర్తు చేశారు. హిందువులు ఎక్కువ మంది లేకపోవటం వల్లే పాకిస్థాన్ ప్రశాంతంగా ఉండలేకపోతోందని వ్యాఖ్యానించారు.
     

>
మరిన్ని వార్తలు