పీఎస్‌ఎల్‌వీ సీ-34కు నేడు కౌంట్‌డౌన్ ప్రారంభం

20 Jun, 2016 07:22 IST|Sakshi
పీఎస్‌ఎల్‌వీ సీ-34కు నేడు కౌంట్‌డౌన్ ప్రారంభం

బుధవారం ఉదయం 9.25 గంటలకు ప్రయోగం

 శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 22న ఉదయం 9.25 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ-34 ఉపగ్రహ వాహకనౌకకు కౌంట్‌డౌన్ సమయాన్ని కొంత మార్పు చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఎంఆర్‌ఆర్ సమావేశంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సాయంత్రం 5.55 గంటలకు ప్రారంభించి 39.30 గంటల అనంతరం ప్రయోగించాలని ముందుగా అనుకున్నారు. కొంత సమయాభావం వల్ల 48 గంటలకు కౌంట్‌డౌన్ సమయాన్ని పెంచారు.

అంటే సోమవారం ఉదయం 9.25 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి బుధవారం ఉదయం 9.25 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 6 గంటలకు సమావేశాన్ని పూర్తి చేసి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ పి.కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారు. రాత్రికి లాంచ్ రిహార్సల్స్ నిర్వహించి సోమవారం ఉదయం 9.25 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రయోగంలో 20 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు.

 పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లో ప్రత్యేకతలు
 పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ- సీ-34)లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఈ సిరీస్‌లో 36వ ప్రయోగం కావడం విశేషం. ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో చేయడం ఇది 14వ ప్రయోగం. గతంలో 10 ఉపగ్రహాలను మోసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ ఈసారి ఒకేసారి 20 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లోని నాల్గో దశను ప్రయోగాత్మకంగా మరో ప్రయోగం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా బహుళ ఉపగ్రహాలను భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువకక్ష్యలో ప్రవేశపెట్టే ప్రక్రియను చేపట్టారు. భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ ఉపగ్రహాలను పంపాలంటే వాటిని వివిధ రకాల కక్ష్యల ప్రవేశపెట్టేందుకు నాల్గో దశను (పీఎస్-4) మాత్రమే ఉపయోగించాలి. అందుకోసం ఇప్పుడు ప్రయోగాత్మకంగా పీఎస్-4 ప్రయోగించనున్నారు.

మరిన్ని వార్తలు