నేడే నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ42

16 Sep, 2018 05:23 IST|Sakshi

ప్రారంభమైన కౌంట్‌డౌన్‌

రాత్రి 10.08 గంటలకు ప్రయోగం

నోవాసార్, ఎస్‌ 1–4 అనే విదేశీ 

ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్న ఇస్రో  

శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి ఆదివారం రాత్రి 10.08 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ42 ఉపగ్రహ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. దీని ద్వారా 889 కిలోల బరువు కలిగిన నోవాసార్, ఎస్‌ 1–4 అనే రెండు విదేశీ(బ్రిటన్‌) ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) రోదసీలోకి పంపనుంది. దీనికి సంబంధించి శనివారం మధ్యాహ్నం 1.08 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. మొదటి ప్రయోగ వేదికపై నుంచి ఆదివారం రాత్రి 10.07 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే వర్షం పడే అవకాశముండటం, రాకెట్‌ వెళ్లే గమనంలోని అంతరిక్ష వ్యర్థాలను తప్పించేందుకు ఒక నిమిషం పొడిగించి.. ప్రయోగ సమయాన్ని ఆదివారం రాత్రి 10.08 గంటలుగా నిర్ణయించారు.

ఇక 33 గంటల కౌంట్‌డౌన్‌లో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం రాత్రి రాకెట్‌కు నాలుగో దశలో ద్రవ ఇంధనం నింపి.. అందులో లోపాలేమైనా ఉన్నాయా అని పరిశీలించారు. ఆదివారం తెల్లవారుజామున రెండో దశలో ద్రవ ఇంధనం నింపే ప్రక్రియను పూర్తి చేశారు. ఆదివారం తుది విడత తనిఖీలు తనిఖీలు నిర్వహించిన అనంతరం పీఎస్‌ఎల్‌వీ సీ42 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించనున్నారు. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ ఆదివారం ఉదయం షార్‌కు చేరుకుని కౌంట్‌డౌన్‌ ప్రక్రియను పరిశీలించనున్నారు.

పీఎస్‌ఎల్‌వీ ప్రస్థానం..
పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) ఇస్రోకు నమ్మకమైన అస్త్రంగా మారింది. శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి ఇప్పటిదాకా పీఎస్‌ఎల్‌వీ ద్వారా 43 ప్రయోగాలు చేయగా.. రెండు మాత్రమే విఫలమయ్యాయి. చంద్రయాన్, మంగళ్‌యాన్‌ లాంటి ప్రయోగాలతో పాటు ఒకేసారి పది ఉపగ్రహాలు, 20 ఉపగ్రహాలు.. ఆ తర్వాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను మోసుకెళ్లిన ఘనత పీఎస్‌ఎల్‌వీకే సొంతం. ఇప్పటిదాకా 43 పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ల ద్వారా 288 ఉపగ్రహాలను ప్రయోగించగా.. ఇందులో 241 విదేశీ ఉపగ్రహాలు, 47 స్వదేశీ ఉపగ్రహాలు కావడం విశేషం.

అలాగే దేశంలోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన ఐదు చిన్నపాటి ఉపగ్రహాలను పంపించిన ఘనత కూడా పీఎస్‌ఎల్‌వీదే. ఇతర దేశాల మీద ఆధారపడి ప్రయోగాలు చేసే దశ నుంచి.. ఇతర దేశాల ఉపగ్రహాలు ప్రయోగించే స్థాయికి ఎదగడానికి పీఎస్‌ఎల్‌వీ రాకెట్టే కారణం. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా.. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా చిన్న తరహా ఉపగ్రహాలను పంపిస్తోంది. ఇస్రోకు వాణిజ్యపరంగా ఏడాదికి సుమారు రూ.1,100 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది కూడా పీఎస్‌ఎల్‌వీ రాకెట్లే కావడం విశేషం. 

>
మరిన్ని వార్తలు