పీఎస్‌ఎల్వీ సీ-43 ప్రయోగం విజయవంతం

29 Nov, 2018 10:11 IST|Sakshi

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ-43 రాకెట్‌ ప్రయోగం విజయవంతమయింది. భారత్‌కు చెందిన హైసిస్‌ ఉపగ్రహంతో పాటు 8 దేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ సీ-43 రాకెట్‌ నిర్దిష్ట కక్ష్యలోకి చేర్చినట్టు ఇస్రో ప్రకటించింది. ఇస్రో సిబ్బంది సమిష్టి కృషి​ వల్లే ప్రయోగం విజయవంతం అయిందని ఇస్రో చైర్మన్‌ డా. కె శివన్‌ తెలిపారు. కాగా, 28 గంటల కౌంట్‌ డౌన్‌ అనంతరం గురువారం ఉదయం 9.58 గంటలకు సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం మొదటి లాంచ్‌ పాడ్‌ నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

ఈ వాహననౌక 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగంలో 380 కిలోల హైసిస్‌ స్వదేశీ ఉపగ్రహంతో పాటు 261.5 కిలోల బరువు కలిగిన 8 దేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను సన్‌ సింక్రోనస్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. హైసిస్‌ భూ ఉపరితల పరిస్థితులను అధ్యయనం చేయనుంది. ఇది ఐదేళ్ల పాటు సేవలు అందించనుంది.

డీడీ రిపోర్టర్‌ కన్నుమూత
పీఎస్‌ఎల్వీ సీ-43 రాకెట్‌ ప్రయోగం కవరేజ్‌ కోసం వచ్చిన చెన్నైదూరదర్శన్‌ రిపోర్టర్‌ రవీంద్రన్‌ గుండెపోటుతో మృతిచెందారు. ఆయన విధుల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీహరికోటకు వచ్చారు. నిన్న రాత్రి మీడియా సెంటర్‌లో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతిపట్ల ఇస్రో శాస్త్రవేత్తలు సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు