రేపు పీఎస్‌ఎల్‌వీ సీ45 ప్రయోగం

31 Mar, 2019 05:32 IST|Sakshi
రెండో ప్రయోగ వేదికపై ప్రయోగానికి సిద్ధంగా ఉన్న పీఎస్‌ఎల్‌వీ సీ45 ఉపగ్రహ వాహకనౌక

నేటి నుంచి కౌంట్‌డౌన్‌ ప్రారంభం 

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఏప్రిల్‌ 1న సోమవారం నాడు ఉదయం 9.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ45 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనున్నట్లు మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌) కమిటీ అధికారికంగా శనివారం ప్రకటించింది. షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాల్‌లో ఎంఆర్‌ఆర్‌ కమిటీ చైర్మన్‌ బీఎన్‌ సురేష్‌ ఆధ్వర్యంలో తుది విడత ఎంఆర్‌ఆర్‌ సమావేశాన్ని నిర్వహించారు. రాకెట్‌కు అన్ని రకాల తనిఖీలు నిర్వహించగా శనివారం రాత్రి లాంచ్‌ రిహార్సల్స్‌ చేసి ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) చైర్మన్‌ ఎస్‌.పాండియన్‌కు అప్పగించారు. ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నారు.

ఈ ప్రయోగంలో 216 కిలోల బరువు కలిగిన ఈఎంఐ శాట్‌ అనే స్వదేశీ ఉపగ్రహంతో పాటు 220 కిలోలు బరువు కలిగిన నాలుగు దేశాలకు చెందిన 28 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగంలో 436 కేజీల బరువు కలిగిన ఈఎంఐ శాట్‌తో పాటు యూఎస్‌ఏకు చెందిన ఫ్లోక్‌–4ఏ పేరుతో 20 చిన్న ఉపగ్రహాలు, లీమూర్‌ పేరుతో మరో నాలుగు చిన్న ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన ఎం–6పీ, బ్లూవాకర్‌–1 అనే రెండు చిన్న తరహా ఉపగ్రహాలు, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకార్ట్‌–1 అనే ఉపగ్రహం, స్పెయిన్‌కు చెందిన ఎయిస్‌టెక్‌ శాట్‌ అనే చిన్న తరహా ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్నారు. 

మరిన్ని వార్తలు