ఇస్రోకు మరో వాణిజ్య విజయం

17 Sep, 2018 03:01 IST|Sakshi
బ్రిటన్‌ ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్తున్న పీఎస్‌ఎల్వీ సీ–42 వాహకనౌక

పీఎస్‌ఎల్‌వీ–సీ42 రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌

విజయవంతంగా కక్ష్యలోకి చేరిన బ్రిటన్‌ ఉపగ్రహాలు  

శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో–ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) పీఎస్‌ఎల్వీ–సీ42 రాకెట్‌ ద్వారా బ్రిటన్‌కు చెందిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది. భూ పర్యవేక్షక ఉపగ్రహాలైన నోవాఎస్‌ఏఆర్, ఎస్‌1–4లను 230.4 టన్నుల బరువున్న పీఎస్‌ఎల్వీ(పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌)–సీ42 వాహక నౌక ఆదివారం రాత్రి సరిగ్గా 10.08 గంటలకు రోదసిలోకి మోసుకెళ్లింది.

33 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్‌ మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి వాహక నౌక దూసుకెళ్లిన తర్వాత నాలుగు దశల్లో, 17.44 నిమిషాల్లో రెండు ఉపగ్రహాలు భూమికి 583 కి.మీ. దూరంలోని సూర్యానువర్తన ధృవ కక్ష్యలోకి చేరాయి. ఆ వెంటనే మిషన్‌ కంట్రోల్‌రూంలో శాస్త్రవేత్తలు కరతాళధ్వనులతో సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తల్ని ప్రధాని మోదీ అభినందించారు. అంతరిక్ష వ్యాపారంలో భారత సామ ర్థ్యాన్ని ఈ ప్రయోగం చాటిచెప్పిందన్నారు.

ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో వాణిజ్యపరంగా మరో మైలురాయిని చేరుకుంది. ఇప్పటికే 23 దేశాలకు చెందిన 241 విదేశీ ఉపగ్రహాలను షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారానే ఇస్రో శాస్త్రవేత్తలు కక్ష్యల్లోకి ప్రవేశపెట్టారు. ఆదివారం నాటి ప్రయోగంతో కలిపి మొత్తంగా 243 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా రోదసిలోకి పంపింది. ప్రయోగం ముగిసిన అనంతరం ఇస్రో చైర్మన్‌ శివన్‌ ప్రయోగంలో పాలుపంచుకున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రయోగానికి ముందు శివన్‌ దంపతులు సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరిని దర్శించుకున్నారు. పీఎస్‌ఎల్‌వీ–సీ42 ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.  

ఉపగ్రహాల విశేషాలివీ..
445 కిలోల బరువున్న నోవాఎస్‌ఏఆర్‌ ఉపగ్రహంలో ఎస్‌–బాండ్‌ సింథటిక్‌ అపార్చర్‌ రాడార్, ఆటోమేటిక్‌ ఐడింటిఫికేషన్‌ రిసీవర్‌ అనే ఉపకరణాలను అమర్చారు. అడవుల మ్యాపింగ్, భూ వినియోగం, మంచు కప్పబడిన ప్రాంతాలను పర్యవేక్షిచడం, వరదలాంటి విపత్తులను గుర్తించడం, సముద్రంలో ఓడలు ఎక్కడున్నాయో కనిపెట్టి, గమ్యస్థానాలకు వెళ్లేందుకు వాటికి సూచనలు ఇవ్వడం ఈ ఉపగ్రహం చేస్తుంది. ఇక ఎస్‌1–4 ఉపగ్రహం 444 కిలోల బరువు ఉంది. ఇది సర్వే వనరులు, పర్యావరణ పర్యవేక్షణ, పట్టణాల నిర్వహణకు ప్రణాళికల తయారీ విపత్తులను గుర్తించడం చేస్తుంది.

శాస్త్రవేత్తలకు జగన్‌ అభినందనలు
సాక్షి, అమరావతి: పీఎస్‌ఎల్వీ సీ–42 రాకెట్‌తో రెండు బ్రిటన్‌ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఇస్రో భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఆరు నెలల్లో 18 ఉపగ్రహాలు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): రాబోయే ఆరు నెలల్లో 18 ఉపగ్రహాలను ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ తెలిపారు. ఆదివారం పీఎస్‌ఎల్‌వీ సీ–42 ప్రయోగం విజయవంతమైన తర్వాత షార్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో జీఎస్‌ఎల్‌వీ మార్గ్‌– డీ1 ద్వారా జీశాట్‌–19 ఉపగ్రహాన్ని, జీఎస్‌ఎల్‌వీ మార్గ్‌– డీ2 ద్వారా జీశాట్‌–29 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామన్నారు. వీటితో పాటు జీఎల్‌ఎల్‌వీ మార్గ్‌–2 ద్వారా జీశాట్‌–20 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతామన్నారు.

అలాగే ఏరియన్‌–5 రాకెట్‌ ద్వారా జీశాట్‌–11ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నట్లు శివన్‌ వెల్లడించారు. ఈ నాలుగు భారీ ఉపగ్రహాలతో దేశంలో కనెక్టివిటీ 100 జీబీపీఎస్‌కు చేరుతుందనీ, తద్వారా సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు. 2019, జనవరి 3 నుంచి ఫిబ్రవరి 16లోపు చంద్రయాన్‌–2 ప్రయోగం చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా ఇస్రో ఏటా రూ.220 కోట్లు అర్జిస్తోందన్నారు. వచ్చే అక్టోబర్‌లో మరో 30 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తామని శివన్‌ వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం ప్రయోగించిన మంగళయాన్‌–1 ఇప్పటికీ చక్కగా పనిచేస్తూ కీలక సమాచారాన్ని పంపిస్తోందని పేర్కొన్నారు.


ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌

మరిన్ని వార్తలు