క్రీమీలేయర్‌లోకి పీఎస్‌యూ ఉద్యోగాలు

31 Aug, 2017 01:10 IST|Sakshi
క్రీమీలేయర్‌లోకి పీఎస్‌యూ ఉద్యోగాలు

ప్రభుత్వ బ్యాంకులు, బీమా కంపెనీలు కూడా..
కేంద్ర కేబినెట్‌ నిర్ణయం
న్యూఢిల్లీ:
ఓబీసీల్లో సంపన్న వర్గమైన ‘క్రీమీలేయర్‌’ పరిధిని కేంద్రం విస్తరించింది. ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూలు), ప్రభుత్వ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో కొన్ని పోస్టులు దీని కిందికి వస్తాయని పేర్కొంది. దీంతో ఆయా స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు, కుటుంబీకులు ఓబీసీ కోటాలో రిజర్వేషన్‌కు దూరమవుతారు. ఇందుకు సంబంధించి కేంద్ర కేబినెట్‌ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓబీసీల్లో సామాజికంగా అభివృద్ధి చెందిన వ్యక్తులు, వర్గాలను కూడా  రిజర్వేషన్‌ పరిధి నుంచి తప్పించింది. తాజా నిర్ణయం ప్రకారం... పీఎస్‌యూల్లో అన్ని ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల(బోర్డు, మేనేజ్‌మెంట్‌ స్థాయి కలుపుకుని)ను గ్రూప్‌ ఏ పోస్టులతో సమానంగా క్రీమీలేయర్‌గా భావిస్తారు.

ప్రభుత్వ బ్యాంకులు, బీమా కంపెనీల్లో జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌–1 ఆపై స్థాయి ఉద్యోగులని గ్రూప్‌ ఏ ఉద్యోగులతో సమానంగా భావిస్తూ క్రీమీలేయర్‌ హోదా ఇస్తారు. ఇక క్లర్క్‌లు, ప్యూన్‌లకు సంబంధించి సమయానుగుణంగా వారి ఆదాయ వనరుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు‘క్రీమీలేయర్‌ పరిధి విస్తరణతో పీఎస్‌యూలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో దిగువ స్థాయుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు... ప్రభుత్వ విభాగాల్లో దిగువ స్థాయుల్లో పనిచేస్తున్న వారి పిల్లలతో సమానంగా  ఓబీసీ రిజర్వేషన్ల ఫలాలు పొందుతారు’ అని కేబినెట్‌ భేటీ అనంతరం ప్రకటనలో కేంద్రం పేర్కొంది.

♦ ఎన్నికల నిర్వహణలో ఆరు దేశాలతో ఒప్పందాలు చేసుకోవాలన్న ఈసీ ప్రతిపాదనకు కేబినెట్‌ అంగీకారం. ఇందులో ఈక్వెడార్, ఆల్బేనియా, భూటాన్, అఫ్గానిస్తాన్, గినియా, మయన్మార్‌ దేశాలున్నాయి.  
♦ పారిశ్రామిక అభివృద్ధి కోసం 40 మిలియన్‌ డాలర్లతో ఫండ్‌ ఏర్పా టుకు భారత్, ఇజ్రాయెల్‌ మధ్య కుదిరిన ఒప్పందానికి  ఆమోదం.

మరిన్ని వార్తలు