పబ్‌జీ ఉచ్చు: తాతా ఖాతాకు చిల్లు

6 Jul, 2020 14:15 IST|Sakshi

మొన్న16 ..నేడు 2 లక్షల రూపాయలు మాయం

పంజాబ్‌లో రెండవ ఘటన

సాక్షి, చండీగఢ్‌ : పబ్‌జీ  మాయలో పడి లక్షల  రూపాయలను మాయం చేసిన ఘటన మరువకముందే పంజాబ్‌లో మరో సంఘటన వెలుగు చూసింది. తాజాగా మొహాలికీ చెందిన ఒక టీనేజర్‌ (15) పబ్‌జీ ఉచ్చులో చిక్కుకుని తన తాత ఖాతాలోంచి 2 లక్షల రూపాయలను కాజేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. (ఆన్‌లైన్ క్లాసుల‌ని ఫోన్ ఇస్తే ఏకంగా..)

తాజా నివేదికల ప్రకారం మొహాలికి చెందిన బాలుడు పబ్‌జీ మొబైల్ గేమ్‌ వలలో చిక్కుకున్నాడు. ఈ ‍క్రమంలో రాయల్‌ గేమ్ ‌గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఇదే అదునుగా భావించిన అతని సీనియర్‌ ఒకడు ఆటలో మెలకువలు నేర్పుతానని మభ్యపెట్టాడు. దీంతో సీనియర్‌ నుంచి శిక్షణ పొందేందుడు మైనర్‌ బాలుడు తన తాతా ఖాతానుంచి భారీ ఎత్తున రహస్య చెల్లింపు చేసేవాడు. తాతా పెన్షన్ ఖాతాను ఇటీవల పేటీఎంకు లింక్‌ చేయడంతో ఈ టీనేజర్‌ పని మరింత సులువైంది. పైగా అతని ఖాతాలోని లావాదేవీలను ఇతర కుటుంబ సభ్యులు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. దీంతో అతనికి అడ్డే లేకుండా పోయింది. గత రెండు  నెలల కాలంలో  పేటీఎంద్వారా 30కి పైగా లావాదేవీలు చేశాడు. ఈ  గేమ్‌కు అవసరమైన స్కిన్‌, క్రాట్స్‌ ఇతర ఫీచర్లను కొనుగోలు చేసుందుకు 55వేలు ఖర్చు పెట్టాడు.  మొత్తంగా సుమారు 2 లక్షల రూపాయలను మాయం జేశాడు. చివరికి విషయం తెలిసిన కుటుంబ పెద్దలు గట్టిగా నిలదీయడంతో పబ్‌జీలోని రాయల్ ఆట కోసం 2 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు  మైనర్‌ బాలుడు  ఒప్పుకున్నాడు. అంతేకాదు ఈ ఆటకోసం కొత్త సిమ్‌కార్డును కూడా కొనుగోలు చేసినట్టు తెలిపాడు. దీంతో బాలుడి కుటుంబం మొహాలీ ఎస్‌ఎస్‌పికి ఫిర్యాదు చేసింది. 

కాగా పంజాబ్‌లోని ఖరార్‌లోని ఒక యువకుడు తన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల నుండి 16 లక్షల రూపాయల మాయం చేసిన ఘటన గతవారం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. కరోనా‌, లాక్‌డౌన్‌ కారణంగా విద్యా సంస్థలు మూతపడటంతో ఇంటికే పరిమితమవుతున్న చిన్నపిల్లలు, టీనేజర్లు, విద్యార్థులు పబ్‌జీ గేమ్‌కు బానిసలవుతున్నారు.  దీంతో మే నెలలో రికార్డు స్థాయిలో 270 మిలియన్‌ డాలర్ల రికార్డు ఆదాయాన్ని వసూలు చేసిందంటేనే ఈ గేమ్‌ డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు