రాజధానిలో హెల్త్‌ ఎమర్జెన్సీ

1 Nov, 2019 14:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దీపావళి నుంచి కాలుష్య తీవ్రత ప్రమాదకరస్ధాయికి చేరడంతో సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో ప్రజారోగ్య ఎమర్జెన్సీని కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. గురువారం రాత్రి ఢిల్లీలో కాలుష్య స్ధాయి ప్రమాదకరంగా మారడంతో నవంబర్‌ 5 వరకూ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించారు. శీతాకాలంలో క్రాకర్స్‌ కాల్చడాన్ని కూడా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నిషేధించింది. మరోవైపు కాలుష్యం ఎమర్జెన్సీ దశకు చేరుకోవడంతో స్కూళ్లలో చిన్నారులకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బ్రీతింగ్‌ మాస్క్‌లను పంచారు.

ఢిల్లీ నగరం గ్యాస్‌ ఛాంబర్‌గా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. హరియాణా, పంజాబ్‌ వంటి పొరుగు రాష్ట్రాల్లో ఈ సీజన్‌లో పంట వ్యర్ధాలను రైతులు తగలబెట్టడం వల్ల ఢిల్లీని కాలుష్యం ముంచెత్తుతోందని ఆయన ఆరోపించారు. కాగా వాయు నాణ్యత ప్రమాదకరంగా మారడంతో  నవంబర్‌ 5 వరకూ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించారు. పాఠశాలలకు సెలవలు ప్రకటిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక వాహనాలకు సరి బేసి స్కీమ్‌ అమలు చేయడంతో పాటు నగరంలోకి ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధిస్తామని అధికారులు పేర్కొన్నారు. కాలుష్య తీవ్రత ప్రమాదకర స్ధాయికి చేరడంతో ఢిల్లీలో మార్నింగ్‌ వాక్‌కు, కార్యాలయాలకు వెళ్లే స్ధానికులు మాస్క్‌లు ధరించి తమ పనుల్లో నిమగ్నమయ్యారు.

మరిన్ని వార్తలు