ఢిల్లీకి మళ్లీ కాలుష్యం కాటు

2 Nov, 2019 03:45 IST|Sakshi
ఢిల్లీలో శుక్రవారం మాస్కులు ధరించి స్కూళ్లకు వెళుతున్న విద్యార్థులు

దేశ రాజధానిలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి

సాక్షి, న్యూఢిల్లీ: వాయు కాలుష్యం దుప్పట్లో దేశ రాజధాని ఢిల్లీ ముసుగేసుకుంది. గాలిలో నాణ్యతా ప్రమాణాలు ప్రమాదకరమైన స్థితికి దిగజారి పోయాయి. గురువారం రాత్రికి రాత్రే వాయు కాలుష్య సూచి 50 పాయింట్లు పెరిగిపోయి 459కి చేరుకుంది. శుక్రవారం రికార్డు స్థాయిలో 599కి చేరుకోవడంతో ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకంలో ఏర్పడిన పర్యావరణ కాలుష్య నివారణ, నియంత్రణ మండలి (ఈపీసీఏ) వాయు కాలుష్య సూచీ అత్యంత తీవ్రమైన స్థితికి చేరుకుందని వెల్లడించింది.

గత ఏడాది జనవరి తర్వాత గాలిలో నాణ్యతా ప్రమాణాలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. పొరుగు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను కాల్చడం, దీపావళి పండుగ సమయంలో బాణాసంచా పేలుళ్లు, పరిశ్రమలు, వాహన కాలుష్యాలతో రాజధాని ఒక గ్యాస్‌ చాంబర్‌లా మారిపోయింది. దీంతో ఢిల్లీ పీసీఏ, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పలు చర్యలు ప్రకటించారు. అందులో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి కూడా ఉంది. ఢిల్లీలో వాయు నాణ్యతను పర్యవేక్షించే 37 స్టేషన్లలో శుక్రవారం తెల్లవారుజాము సమయానికి ప్రమాదకరమైన సూచికలే కనిపించాయి.

పొరుగు రాష్ట్రాలదే బాధ్యత: కేజ్రీవాల్‌
పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాల్ని ఇష్టారాజ్యంగా కాల్చడం వల్లే ఢిల్లీ గ్యాస్‌ చాంబర్‌లా మారిపోయిందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మండిపడ్డారు. కాలుష్యం తీవ్రతరం కావడంతో పాఠశాలల పిల్లలకు మాస్క్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకునేలా మా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి అంకుల్‌ అంటూ హరియాణా సీఎంలు అమరీందర్‌ సింగ్, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌లను ఉద్దేశించి పిల్లలంతా లేఖలు రాయాలని సూచించారు. ఢిల్లీ ప్రభుత్వం మొత్తంగా 50 లక్షల మాస్క్‌లను పంపిణీ చేస్తోంది. మాస్క్‌ లేకుండా బయటకు రావద్దని రాజధాని వాసులను సీఎం కోరారు.


ఢిల్లీలో గాలి నాణ్యతా సూచీ (కాలుష్యం) పాయింట్లు ఎంత ఎక్కువగా ఉన్నాయో చెప్తూ జర్నలిస్ట్‌ విక్రమ్‌ చంద్ర ట్వీట్‌ చేసిన ఫొటో ఇది. 

మరిన్ని వార్తలు