దావూద్‌ హోటల్‌ కూల్చేసి.. టాయిలెట్‌ కట్టిస్తా!

10 Nov, 2017 22:43 IST|Sakshi

ముంబయి : మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు చెందిన ఓ హోటల్‌ మరుగుదొడ్డిగా మారనుంది. కరడుగట్టిన హిందూత్వ వాది స్వామి చక్రపాణి ప్రభుత్వం నిర్వహించే వేలంలో దానిని దక్కించుకుని ఆ స్థానంలో పబ్లిక్‌ టాయిలెట్‌ను నిర్మిస్తానని ప్రకటించారు. ఇంతకుముందు ఆయనే.. దావూద్‌కు చెందిన కారును వేలంలో దక్కించుకుని ఆ తర్వాత దానిని తగులబెట్టేసిన విషయం తెలిసిందే.

భేండి బజార్‌లో మాఫియా డాన్‌కు ఢిల్లీ జైకా అనే హోటల్‌ ఉండేది. ముంబై దాడుల అనంతరం, దావూద్‌ దొంగచాటుగా విదేశాలకు పారిపోవటంతో ప్రభుత్వం అతని ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. ఇందులో అతని కారుతోపాటు హోటళ్లు కూడా ఉన్నాయి. వీటిలో కారును వేలానికి ఉంచగా స్వామి చక్రపాణి దానిని దక్కించుకుని, తగులబెట్టారు. రెండేళ్ల క్రితం హోటల్ వేలం నిర్వహించగా అది సఫలం కాలేదు. దీంతో ఈ నెల 14వ తేదీన మరోసారి వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో తానే దక్కించుకుంటానని, దానిని కూలగొట్టి ఆ ప్రదేశంలో పబ్లిక్‌ మరుగుదొడ్డిని నిర్మిస్తానని శుక్రవారం ఆయన ప్రకటించారు.

టాయిలెట్‌ నిర్మాణం పూర్తయ్యాక దానిని ప్రారంభించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఆహ్వానిస్తానని చెప్పారు. తీవ్రవాదానికి, తీవ్రవాదులకు ఎలాంటి చివరికి గతి పడుతుందో చెప్పటానికి ఈ పని చేస్తున్నానని స్పష్టం చేశారు. స్వామి చక్రపాణి ఆప్తమిత్రుడు, ఢిల్లీకి చెందిన న్యాయవాది అయిన అజయ్‌ శ్రీవాస్తవ మాఫియా డాన్‌కు చెందిన నగ్‌పడాలోని భవనాన్ని వేలంలో సొంతం చేసుకున్నారు. అనంతరం దానిని కూడా చక్రపాణికి చేశారు. ఆ భవనంలో ఆస్పత్రి ప్రారంభించి పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందజేస్తామని ప్రకటించారు. దీనిద్వారా దావూద్‌ తీవ్రవాద చర్యలకు బలైన వారి ఆత్మలకు శాంతి కలిగిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు