పుదుచ్చేరి గవర్నర్ తొలగింపు!

12 Jul, 2014 03:03 IST|Sakshi

న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నియమితులైన రాష్ట్ర గవర్నర్లను మార్చే ప్రయత్నంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ సర్కారు ఆ పనిలో వేగం పెంచింది. ఇందులో భాగంగా శుక్రవారం తొలిసారిగా ఓ గవర్నరుపై వేటు వేసింది. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీరేంద్ర కటారియాను తొలగించి, ఆ స్థానంలో అండమాన్, నికోబార్ దీవుల లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అజయ్‌కుమార్‌కు అదనంగా బాధ్యతలను అప్పగించింది. గవర్నర్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని వీరేంద్రను ఆదేశిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారని రాష్ట్రపతి భవన్ వర్గాలు శుక్రవారం రాత్రి ప్రకటించాయి.

గవర్నర్ తొలగింపు అనేది.. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లకు హెచ్చరికలాంటిదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలాఉండగా.. తనను సంప్రదించకుండా మిజోరం నుంచి నాగాలాండ్‌కు బదిలీ చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గవర్నర్ వక్కొం బి. పురుషోత్తమన్ శుక్రవారం రాజీనామా చేశారు. గవర్నర్లను, ప్రభుత్వ అధికారుల మాదిరిగా బదిలీ చేయడం అవమానించడమేనన్నారు. రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ అల్వా శనివారం సాయంత్రం(నేడు) గోవా గవర్నర్‌గా ప్రమాణం చేయనున్నారు.
 

మరిన్ని వార్తలు