పుదుచ్చేరి పీఠం స్వామికే...

29 May, 2016 06:46 IST|Sakshi
పుదుచ్చేరి పీఠం స్వామికే...

సీఎల్‌పీ నేతగా ఏకగ్రీవ ఎన్నిక
 
 పుదుచ్చేరి: పుదుచ్చేరి ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న సస్పెన్స్‌కు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి వి.నారాయణస్వామి సీఎల్‌పీ నాయకుడిగా శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తద్వారా ఆయన పుదుచ్చేరి పదో సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసే బాధ్యతను సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్‌కు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. నారాయణస్వామి పేరును పీసీసీ అధ్యక్షుడు ఎ.నమశ్శివాయమ్ ప్రతిపాదించారని, దానికి మాజీ ముఖ్యమంత్రి వి.వైతిలింగమ్ మద్దతు తెలిపారని షీలా, ముకుల్ తెలిపారు.

ఏఐసీసీ అధినేత సోనియాగాంధీ కూడా నారాయణస్వామికి ఆమోదముద్ర వేశారన్నారు. పుదుచ్చేరి పీఠం కోసం నమశ్శివాయమ్ చివరి వరకూ పోటీపడ్డారు. అయితే ఢిల్లీ పెద్దల రంగప్రవేశంతో నారాయణస్వామి ఎన్నిక ఏకగ్రీవమైంది. నారాయణస్వామికి సోనియా ఫోన్‌లో అభినందనలు తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో నారాయణస్వామి సహాయ మంత్రిగా పనిచేశారు. అయితే ఈ నెలలో జరిగిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆయన ఉప ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. కాగా, నారాయణస్వామితో సీఎం పదవికి పోటీపడ్డ నమశ్శివాయమ్ విలియనూర్ నుంచి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 30 స్థానాలకు కాంగ్రెస్ 15, మిత్రపక్షమైన డీఎంకే 2 సీట్లు గెలుపొందాయి. మంత్రివర్గంలో ఎంత మంది ఉండాలనే దానిపై గవర్నర్‌ను కలుస్తానని, అందులో డీఎంకే సభ్యులెందరనేది తరువాత నిర్ణయిస్తామని నారాయణస్వామి తెలిపారు.  

 వ్యతిరేక వర్గం నిరసన... బస్సులపై దాడి...
 సీఎల్‌పీ నాయకుడిగా నారాయణస్వామి ఎన్నిక ప్రక్రియ అంతా సవ్యంగానే సాగిందని అధిష్టానం నుంచి వచ్చిన షీలా దీక్షిత్ చెప్పినా... పార్టీలోని ఆయన ప్రత్యర్థి వర్గం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. నారాయణస్వామి ఎన్నికను నిరసిస్తూ కాంగ్రెస్‌లోని ఓ వర్గానికి చెందిన మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. బస్సులపై రాళ్లు రువ్వారు. పుదుచ్చేరి- చెన్నై మధ్య తిరిగే 8 బస్సులు ధ్వంసమయ్యాయి. డ్రైవర్‌తో పాటు కొందరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

మరిన్ని వార్తలు