క‌రోనా: అవి వాడాకా ఒక్కరు కూడా చనిపోలేదు

13 Jul, 2020 14:46 IST|Sakshi

ఢిల్లీ : హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగుల మరణాలను తగ్గించడంలో పల్స్ ఆక్సిమీట‌ర్లు ఎంతగానో  ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ అన్నారు. వీటిని సురక్షా కవచాలు (ర‌క్ష‌ణ క‌వచాలు)గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. తేలిక‌పాటి కరోనా ల‌క్ష‌ణాలున్న రోగుల‌కు ప్ర‌భుత్వం ఈ ప‌ల్స్ ఆక్సిమీట‌ర్ల‌ను అంద‌జేసింద‌ని పేర్కొన్నారు. రోగి రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ ప‌డిపోతున్న‌ట్లు అనిపిస్తే హెల్త్ టీంను సంప్ర‌దించ‌గానే ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను పంపుతున్నామ‌ని కేజ్రివాల్ అన్నారు. ఒక‌వేళ ఆక్సిజన్ స్థాయి 90 శాతం, లేదా అంతకన్నా ప‌డిపోతే వారిని వెంట‌నే ఆసుపత్రికి త‌ర‌లిస్తున్నట్లు తెలిపారు. (కరోనా: కేజ్రీవాల్‌‌ ప్రభుత్వం కీలక నిర్ణయం)

గ‌త 15 రోజులుగా ఢిల్లీలో మ‌ర‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉంద‌ని, జూలై మొద‌టివారం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మ‌ర‌ణాలు న‌మోదు కాలేద‌ని కేజ్రివాల్ స్ప‌ష్టం చేశారు. ప‌ల్స్ ఆక్సిమీట‌ర్లు వాడాకా రోజువారి మ‌ర‌ణాల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గింద‌ని వివ‌రించారు. ఢిల్లీలో క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్న నేపథ్యంలో హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారికి ప‌ల్స్ ఆక్సిమీట‌ర్లు అందివ్వాల‌ని ముఖ్య‌మంత్రి కేజ్రివాల్ నిర్ణ‌యించారు. రోగి ఆక్సిజ‌న్ స్థాయి 90 లేదా అంత‌క‌న్నా త‌క్కువ‌కు ప‌డిపోతే ఈ ప‌రిక‌రం వెంట‌నే అప్ర‌మ‌త్తం చేస్తుంది. రోజూవారి టెలి కౌన్సిలింగ్, ఆక్సిమీట‌ర్ల ద్వారా హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారి మ‌ర‌ణాల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయింది. ఆస్పత్రికి వెళ్ల‌కుండానే ఎంతోమంది క‌రోనా రోగులు ఈ విధాన వ‌ల్ల కోలుకున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. (కొత్తగా 28,701 పాజిటివ్‌ కేసులు)

మరిన్ని వార్తలు