మరిదిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి

28 Feb, 2019 13:04 IST|Sakshi

బెంగళూరు: దేశం కోసం అమరుడైన సీఆర్పీఎఫ్‌ జవాన్‌ భార్యకు రక్షణ లేకుండా పోయింది. భర్త చనిపోయి రెండు వారాలు కూడా గడవకముందే.. అత్తింటివారి నుంచి ఆ మహిళకు వేధింపులు మొదలయ్యాయి. ఈ వేధింపులు తాళలేక ఆమె పోలీసులను కూడా ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా ఉగ్రదాడిలో కర్ణాటక మండ్యాకు చెందిన జవాన్‌ హెచ్‌ గురు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ విషాదంతో ఆయన భార్య కళావతి(25) తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అమరుడైన భర్తకు కన్నీటి నివాళులర్పించారు. (సైన్యంలో చేరతా అమర జవాన్‌ భార్య)

గురు అంత్యక్రియలు ముగిసిన కొద్ది రోజులకు అతని కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. అమర జవాన్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట​పరిహారం ప్రకటించాయి. అంతేకాకుండా ప్రజలు కూడా పెద్ద ఎత్తున విరాళాలు అందజేయడానికి ముందుకొచ్చారు. అయితే ఈ మొత్తాన్ని కళావతికి చెందకుండా తామే దక్కించుకోవాలని భావించిన గురు కుటుంబ సభ్యులు.. అందుకోసం పథకం రచించారు. గురు చిన్న సోదరుడుకి, కళావతికి పెళ్లి చేస్తే వచ్చిన పరిహారం అంత తమకే చెందుతుందని భావించారు. ఈ మేరకు మరిదిని పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమెపై ఒత్తిడి తీసుకోచ్చారు. ఈ వేధింపులు శ్రుతి మించడంతో.. ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె బుధవారం మండ్యా పోలీసులను ఆశ్రయించారు. (అమర జవాన్‌ కుటుంబానికి సుమలత సాయం)

 దీనిపై ఓపికతో  ఉండాలని ఆమెకు సూచించిన పోలీసులు....  ఈ ఘటనపై ఎటువంటి విచారణ చేపట్టలేదని, కేసు కూడా నమోదు చేయలేదని తెలిపారు. అయితే కళావతి అత్తింటివారిని పోలీసులు హెచ్చరించారు. ఈ సమస్య ఇలాగే కొనసాగితే సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తుందని హితవు పలికారు. ఈ ఘటనపై ఓ సీనియర్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఇది కుటుంబ సమస్య అని, సున్నితమైన అంశమని పేర్కొన్నారు. మరోవైపు బుధవారం మండ్యాలో పర్యటించిన సీఎం కుమారస్వామి కళావతికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

మరిన్ని వార్తలు