పుల్వామా ఉగ్రదాడి : తండ్రికూతుళ్ల అరెస్ట్‌

3 Mar, 2020 16:04 IST|Sakshi

శ్రీనగర్‌ : పుల్వామా ఉగ్రదాడి విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కీలక ముందడుగు వేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న తండ్రికూతుళ్లను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయిన వారిలో జమ్మూకశ్మీర్‌లోని లెత్‌పొరాకు చెందిన తారిక్ అహ్మద్ షా, ఇన్షా తారిక్‌లు ఉన్నారు. సోమవారం రాత్రి వారి ఇళ్లపై సోదాలు జరిపిన అధికారులు మంగళవారం తెల్లవారుజామున అహ్మద్‌, ఇన్షాలను అరెస్ట్‌ చేశారు. పుల్వామా దాడికి కొద్ది రోజుల ముందు వీరు జైషే మొహ్మద్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్టుగా తెలుస్తోంది. అహ్మద్‌, ఇన్షా అరెస్ట్‌లతో ఈ కేసుకు సంబంధించి అరెస్ట్‌ చేసిన వారి సంఖ్య మూడుకు చేరింది.

గతవారం పుల్వామా ఉగ్రదాడికి సహకరించిన జైషే మొహ్మద్‌ సభ్యుడు షకీర్‌ బషీర్‌ మాగ్రేను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. పుల్వామా దాడిలో పాల్గొన్న ఆత్మా హుతి సభ్యుడు ఆదిల్‌ అహ్మద్‌ ధార్‌కు షకీర్‌ వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాడు. షకీర్‌ను విచారిస్తున్న ఎన్‌ఐఏ అధికారులు.. అతడి నుంచి రాబట్టిన సమాచారం మేరకే అహ్మద్‌, ఇన్షాలను అరెస్ట్‌ చేసినట్టుగా తెలుస్తోంది. కాగా, గతేడాది ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ వాహన శ్రేణిపై జరిగిన ఆత్మహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. (చదవండి : ‘పుల్వామా’ నిందితుడి అరెస్ట్‌)

మరిన్ని వార్తలు