ఆ పోలీసు దంపతులకు ఝలక్!

18 Nov, 2016 10:21 IST|Sakshi
ఆ పోలీసు దంపతులకు ఝలక్!

పుణె: అత్యున్నత శిఖరం ఎవరెస్ట్ అధిరోహించామని అందర్నీ నమ్మించిన పోలీసు జంటకు డిపార్ట్ మెంట్ ఝలక్ ఇచ్చింది. ఆరు నెలల తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో వారిద్దరిని పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పోలీస్ కమిషనర్ రష్మీ శుక్లా కథనం ప్రకారం... తారకేశ్వరీ, దినేష్ రాథోడ్ దంపతులు పుణెలో కానిస్టేబుల్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత మే నెలలో వీరిద్దరూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికని సెలవుపై వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత మే23న ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని అధిరోహించినట్లు జూన్ 5న డిపార్ట్ మెంట్‌కు ఫోన్ చేసి చెప్పారు. భారత్ నుంచి ఎవరెస్ట్ అధిరోహించిన తొలి దంపతులు తామేనని నమ్మబలికారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అందించారు.

ఆ ఫోటోలను చూసిన ఓ వ్యక్తి తాను 21న ఎవరెస్ట్ పై దిగిన ఫొటోలను పోలీసు జంట మార్ఫింగ్ చేసిందని ఆరోపించాడు. మరికొందరు వీరి తీరుపై అనుమానం వ్యక్తంచేస్తూ నిజనిజాలను కనుగొనాలని పోలీసులను కోరారు. శ్రీహరి తాప్కిర్ అనే వ్యక్తి మాత్రమే తమ గ్రూప్ నుంచి ఎవరెస్ట్ చివరివరకూ చేరుకున్నారని పోలీసులకు తెలిపారు. శివాజీనగర్ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు తారకేశ్వరీ, దినేష్ రాథోడ్ లను విచారించగా అసలు విషయం బయటపడింది. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పాటు, హిమాలయాల నుంచి తిరిగొచ్చిన తర్వాత డిపార్ట్‌మెంట్‌కు రిపోర్ట్ కూడా చేయలేదని చెప్పారు.

బెంగళూరుకు చెందిన సత్యరూప్ సిద్ధాంత ఫొటోలను వీరు ఫొటోషాప్ చేసి తాము ఎవరెస్టు ఎక్కినట్లు అందర్నీ నమ్మించారని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పోలీసుశాఖ వీరిని సస్పెండ్ చేసింది. మరో పదేళ్లపాటు వీరు ఎవరెస్ట్ అధిరోహించడానికి వీలులేదని నేపాల్ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఈ విషయంపై వారిని మీడియా సంప్రదించగా.. తమకు ఎలాంటి నోటీసులు రాలేదని దినేష్ రాథోడ్, తారకేశ్వరీ చెప్పారు.

మరిన్ని వార్తలు