భర్త కళ్లెదుటే కొట్టుకుపోయిన భార్య

27 Sep, 2019 15:25 IST|Sakshi

పుణే: భర్త కళ్లెదుటే నీటిలో కొట్టుకుపోయి భార్య ప్రాణాలు వదిలిన విషాద ఘటన పుణేలోని సహకార్‌ నగర్‌ ప్రాంతంలో ఉన్న టాంగేవాలే కాలనీలో చోటు చేసుకుంది. పుణేలో బుధవారం రాత్రి నాలుగు గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. టాంగేవాలే కాలనీకి చెందిన సంజయ్‌ రాణె భార్య కూడా మృతుల్లో ఉన్నారు. ఆకాశానికి చిల్లులు పడినట్టుగా కురిసిన వర్షంతో వీధులన్నీ వరదలతో పోటెత్తాయి. సంజయ్‌ భార్య జోత్స్న(40) ఆయన కళ్లెదుటే వరదల్లో కొట్టుకుపోయారు.

‘ఒక్కసారి వరద నీరు పోటెత్తడంతో ఇంట్లోంచి బయటపడేందుకు ప్రయత్నించాం. భారీ ప్రవాహం ధాటికి జోత్స్న నా కళ్ల ముందే నీటిలో కొట్టుకుపోయింది. ఆమెను కాపాడలేపోయాను. తర్వాత ఆమె మృతదేహం సమీపంలో లభ్యమైంది. మా కుటుంబానికి ఇది ఊహించని షాక్‌. ముఖ్యంగా పదేళ్ల మా కుమారుడు వరద్‌ చిన్న వయసులోనే అమ్మను కోల్పోయాడు’ అంటూ సంజయ్‌ కన్నీళ్ల పర్యంతమయ్యారు. గంగతీర్థ సొసైటీ వెనుక భాగంగా టాంగేవాలే కాలనీ ఉంది. సొసైటీ వెనుక భాగంలోనే కాలువ ఉంది. ఆక్రమణల కారణంగా ఈ కాలువ కుంచింకుపోయింది. బుధవారం రాత్రి కుండపోతకు కాలువ పోటెత్తడంతో సమీపంలోని కాలనీలు అన్ని వరదలో చిక్కుకున్నాయి.

నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో కాలనీ వాసులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఇళ్లపైకి, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారని స్థానికుడు గోపినాథ్‌ జాదవ్‌ తెలిపారు. వరదల బారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆయన కాలికి గాయమైంది. భారీ వర్షాల కారణంగా తమ ఇళ్లలోని వస్తువులన్నీ దెబ్బతిన్నాయని, వర్షాలు ఇలాగే కొనసాగితే తామంతా షెల్టర్లు చూసుకోవాల్సి ఉంటుందని యమునాబాయ్‌ షిండే అనే వృద్ధురాలు వాపోయారు. కుండపోత విధ్వంసానికి 800పైగా జంతువులు చనిపోయాయి. 2 వేలకు పైగా వాహనాలు మునిపోయాయి. ముందు జాగ్రత్తగా గురువారం పుణేలోని పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. (చదవండి: వరుణుడా.. కాలయముడా?)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా