ఆమెకు 24.. అతడికి 67.. వారికి రక్షణ కల్పించండి!

8 Feb, 2019 14:12 IST|Sakshi
షంషేర్‌ సింగ్‌- నవ్‌ప్రీత్‌ కౌర్‌(కర్టెసీ : హెచ్‌టీ)

చండీగఢ్‌ : ప్రేమ వివాహం చేసుకున్న జంటకు రక్షణ కల్పించాల్సిందిగా పంజాబ్‌- హర్యానా ఉమ్మడి హైకోర్టు పంజాబ్‌ పోలీసులను ఆదేశించింది. వారి ప్రాణాలకు ప్రమాదం ఉన్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. బలైన్‌ గ్రామానికి చెందిన షంషేర్‌ సింగ్‌(67), చండీగఢ్‌కు చెందిన నవ్‌ప్రీత్‌ కౌర్‌(24)లు తమ కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా గత నెలలో పెళ్లి చేసుకున్నారు. చండీగఢ్‌ గురుద్వారాలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో కుటుంబ సభ్యులతో పాటు వివిధ వర్గాల నుంచి వీరికి బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో షంషేర్‌, నవ్‌ప్రీత్‌లు తమకు రక్షణ కల్పించాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు.

కాగా ఈ విషయం గురించి వీరి తరఫు న్యాయవాది మాట్లాడుతూ .. ‘ షంషేర్‌, నవ్‌ప్రీత్‌ల బంధాన్ని వారి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. వాళ్లను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అందుకే వారు కోర్టును ఆశ్రయించారు. వారిద్దరికి రక్షణ కల్పించాలని సంగ్‌నర్‌, బర్నాల జిల్లాల ఎస్పీలను కోర్టు ఆదేశించింది. వారిద్దరు మేజర్లు. కాబట్టి వారికి కలిసి జీవించే హక్కు ఉంది అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాము ఎటువంటి బెదిరింపులకు పాల్పడలేదని, తమ గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని షంషేర్‌ కుటుంబ సభ్యులు వాపోయారు.

మరిన్ని వార్తలు