మరింత కఠినంగా లాక్‌డౌన్‌: పంజాబ్‌ సీఎం

12 Jun, 2020 16:35 IST|Sakshi

కరోనా నియంత్రణ చర్యలపై పంజాబ్‌ సీఎం సమీక్ష

చండీగఢ్‌: మహమ్మారి కరోనా విజృంభణ నేపథ్యంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారాంతాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు మరింత కఠినతరంగా అమలు చేయాలని గురువారం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ రోజుల్లో పరిశ్రమలు తెరిచేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. కాగా గురువారం నాటికి పంజాబ్‌లో 2887 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించిన సీఎం అమరీందర్‌ సింగ్‌.. సామాజిక వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వైద్య, పారిశుద్ద్య, ఇతర అత్యవసర సేవా విభాగాల సిబ్బంది తప్ప ఇతరులెవరైనా తప్పనిసరి ప్రయాణాలకు కరోనా వైరస్‌ అలర్ట్‌ యాప్‌ నుంచి ఇ-పాసులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపారు. (‘వారిని పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు’)

అదే విధంగా పెద్ద సంఖ్యలో పౌరులు ఒక్కచోట చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ దిన్‌కర్‌ గుప్తాను సీఎం అమరీందర్‌ సింగ్‌ ఆదేశించారు. ఇప్పటి వరకు కరోనాకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానందున స్వీయ నియంత్రణ చర్యలు తీసుకుంటూ మహమ్మారితో పోరాడాలని.. ఇందుకోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో కొంతమంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందన్న సీఎం.. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. వారంతా తప్పనిసరిగా పరీక్షలు చేయించుకుని.. హోం క్వారంటైన్‌లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా అధిక బిల్లు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల తీరును ఉపేక్షించబోమని.. ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్ల వివరాలు పబ్లిక్‌ డొమైన్‌లో పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్న వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.(‘రీలాక్‌ ఢిల్లీ’ వార్తలపై స్పందించిన సత్యేంద్ర జైన్‌)

మరిన్ని వార్తలు