లాక్‌డౌన్‌: పంజాబ్‌ కీలక నిర్ణయం

29 Apr, 2020 21:00 IST|Sakshi
కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌

చండీగఢ్‌: కరోనా మహమ్మారిపై పోరాటంలో పంజాబ్‌ మరో ముందడుగు వేసింది. లాక్‌డౌన్‌లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ఫ్యూను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ బుధవారం ఈ మేరకు ప్రకటన చేశారు. ‘కర్ఫ్యూను మరో రెండు వారాలు పొడిగించాలని నిర్ణయించాం. ప్రతి రోజు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తాం. ఈ సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిత్యవసర సరుకులు తెచ్చుకోవచ్చు. దుకాణాలు తెరిచేందుకు కూడా ఇదే సమయంలో అనుమతి ఉంటుంద’ని ఆయన తెలిపారు. 

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే మరికొంత కాలం లాక్‌డౌన్‌ పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోదీని పలువురు ముఖ్యమంత్రులు కోరారు. దీంతో లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పొడిగించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. కాగా, ఇప్పటివరకు దేశంలో 31 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వెయ్యిపైగా మరణాలు సంభవించాయి. (సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి)

మరిన్ని వార్తలు