పంజాబ్‌లో లాక్‌డౌన్ ఆంక్ష‌లు మ‌రింత క‌ఠినం

13 Jul, 2020 20:05 IST|Sakshi

చండీగ‌ఢ్: క‌రోనా క‌ట్ట‌డికి మ‌రింత క‌ఠినంగా ఆంక్ష‌లను విధిస్తూ సోమ‌వారం పంజాబ్ స‌ర్కార్ కీల‌క  నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే బ‌హిరంగ స‌భ‌ల‌న్నింటినీ నిషేధించిన రాష్ర్టం.. వివాహాలు, ఇత‌ర సామాజిక కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి ప‌రిమితులు విధించింది. ఎవ‌రైనా ఆంక్ష‌ల‌ను ఉల్లంఘిస్తే త‌ప్ప‌నిస‌రిగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. బ‌హిరంగ స‌మావేశాల్లో ఐదుగురికి మించి ఉండరాద‌ని, వివాహాల్లో అతిధుల సంఖ్య‌ను 50కి బ‌దులుగా 30కి త‌గ్గిస్తూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. (క‌రోనా: అవి వాడాకా ఒక్కరు కూడా చనిపోలేదు )

వివాహ వేడుక‌ల‌కు 50, అంత్య‌క్రియ‌ల‌కు 20 మందికి మించ‌రాద‌ని కేంద్రం మే నెల‌లోనే స్ప‌ష్టంచేసింది. ప‌లు రాష్ర్టాలు సైతం దీన్నే అవ‌లంభిస్తున్నాయి. అయితే తాజాగా క‌రోనా కేసులు అధికమ‌వుతున్నందున ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠినం చేయాల‌ని సర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. దేశంలోనే అత్య‌ధిక క‌రోనా ప్ర‌భావిత రాష్ర్టాలైన మహారాష్ర్ట‌, ఢిల్లీ, త‌మిళ‌నాడు జాబితాల్లోకి పంజాబ్ వెళ్లాల‌నుకోవ‌డం లేద‌ని అందుకే ఆంక్ష‌లు మ‌రింత క‌ఠినం చేస్తున్నట్లు సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ ప్ర‌క‌టించారు. రాష్ర్ట వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లోనే 234 కొత్త క‌రోనా కేసులు నిర్దార‌ణ కాగా న‌లుగురు మ‌ర‌ణించారు. ఇప్ప‌టివ‌ర‌కు 7,821  క‌రోనా కేసులు న‌మోదు కాగా 5,392మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో పంజాబ్‌లో ప్ర‌స్తుతం 2,230 యాక్టివ్ కేసులే ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. (అంత్య‌క్రియ‌లకు హాజ‌రైన 20 మందికి క‌రోనా)

మరిన్ని వార్తలు