ఇక పెంపుడు జంతువులపై పన్ను!

24 Oct, 2017 13:40 IST|Sakshi

సాక్షి, ఛండీగఢ్ : పెంపుడు జంతువుల మీద పన్ను విధిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు స్థానిక మీడియాలు కథనం ప్రచురించాయి. రాష్ట్ర మంత్రి నవజ్యోత్‌ సింగ్ సిద్దూ నేతృత్వంలోనే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. బ్రాండింగ్ కోడ్ పేరిట గుర్తింపు చిహ్నలను లేదా నంబర్లను వాటికి కేటాయించటంగానీ, అవసరమైతే జంతువుల్లో మైక్రో చిప్‌లను అమరుస్తామని ప్రభుత్వం ప్రకటించటం విశేషం.
 
కుక్క, పిల్లి, గుర్రం, పంది, బర్రె, ఆవు, ఏనుగు, ఒంటె, గుర్రం.. ఇలా పెంచుకునే జంతువులన్నీ తాజా ఆదేశాల పరిధిలోకి వస్తాయి. కోళ్లు, చిలుకలు, పావురాలు వంటి పక్షులకు ఇది వర్తిస్తుందో లేదో స్పష్టత ఇవ్వలేదు. పంచాయితీలను మినహాయించి అన్ని మున్సిపాలిటీలలో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. 200 నుంచి 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ పన్ను కట్టకపోతే మున్సిపల్‌ అథారిటీలు వాటిని స్వాధీనం చేసుకునే వెసులుబాలు కల్పించారు. 

అయితే దీనికి న్యాయ పరమైన చిక్కులు ఎదరయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతుండగా.. అసలు ఈ చట్టం అమలులోకి వచ్చిందా? అన్నది తేలాల్సి ఉంది. నోటిఫికేషన్‌లో స్పష్టత లేనందునే ఈ సమస్య ఉత్పన్నమైందని అధికారులు చెబుతున్నారు. మరోపక్క జంతు ప్రేమికులు ఈ నిబంధనలపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. సరదాగా ఇంట్లో పెంచుకునే జంతువులపై పన్నులు విధించటమేంటని కొందరు నిలదీస్తుంటే..  డెయిరీ ఫామ్‌లు నిర్వహించే వారి పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. గతంలో గోవా, కేరళలోనూ ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నాలే చేయగా.. నిరసనలు వ్యక్తం కావటంతో వెనకడుగు వేశాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా