-

ఆ వారసులకు రూ.20 వేల కోట్లు

3 Jun, 2020 04:07 IST|Sakshi

ఫరీద్‌ కోట్‌ కేసులో పంజాబ్, హరియాణా హైకోర్టు కీలక తీర్పు

మహారాజు మాతృమూర్తి, ఆయన కూతుళ్లకే ఆస్తులు

చండీగఢ్‌: ఫరీద్‌ కోట్‌ మహారాజు హరీందర్‌ సింగ్‌ బ్రార్‌కు చెందిన రూ. 20 వేల కోట్ల విలువైన ఆస్తికి వారసులెవరనే విషయంలో పంజాబ్‌ అండ్‌ హరియాణా హైకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. మహారాజు కూతుళ్లు అమృత్‌ కౌర్, దీపిందర్‌ కౌర్‌లకు 75%, తల్లి దివంగత మొహిందర్‌ కౌర్‌కు మిగతా 25% వాటా చెందుతుందని స్పష్టం చేసింది. మొహిందర్‌ కౌర్‌ వాటాపై హరీందర్‌ సింగ్‌ సోదరుడైన మంజిత్‌ ఇందర్‌ సింగ్‌ వారసులకు హక్కు ఉంటుందని పేర్కొంది. మూడేళ్ల వయసులో హరీందర్‌ సింగ్‌ ఫరీద్‌కోట్‌ ఎస్టేట్‌కు రాజయ్యారు. ఆ సంస్థానం చివరి రాజు ఆయన నరీందర్‌ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కూతుళ్లు. ఒక కుమారుడు. కూతుళ్లు అమృత్‌ కౌర్, దీపిందర్‌ కౌర్, మహీపిందర్‌ కౌర్‌. కుమారుడు హర్మొహిందర్‌ సింగ్‌ 1981లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు.

కూతురు మహీపిందర్‌ కౌర్‌  పెళ్లి కాకముందే మరణించారు. మహారాజు హరీందర్‌ సింగ్‌ 1989లో చనిపోయారు. అనంతరం ఆయన ఎస్టేట్‌ ఆస్తులపై వివాదం మొదలైంది. మహారాజు హరీందర్‌కు వంశపారంపర్యంగా వచ్చిన విలువైన ఆస్తులు హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్, హరియాణాల్లో ఉన్నాయి. వాటి విలువ రూ. 20 వేల కోట్లకు పైనే. కోర్టు కేసు నడుస్తుండగా దీపిందర్‌ కౌర్‌ మరణించారు. మహారాజు హరీందర్‌ సింగ్‌ మరణం తరువాత ఆయన రాసినట్లుగా చెబుతున్న వీలునామా ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో దీపిందర్‌ సింగ్‌ నిర్వహిస్తున్న ‘మహర్వాల్‌ కేవాజీ ట్రస్ట్‌’కు ఆస్తి చెందాలని ఉంది. అయితే, ఆ వీలునామా చెల్లదని ముందుగా చండీగఢ్‌ కోర్టు, ఆ తరువాత తాజాగా హైకోర్టు తేల్చిచెప్పాయి. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తి పంపకం జరగాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాజ్‌మోహన్‌ సింగ్‌ తీర్పునిచ్చారు.

ఆ ప్రకారం, ఇద్దరు కూతుళ్లకు, మహారాజు చనిపోయిన సమయంలో జీవించి ఉంది కనుక ఆయన తల్లి మొహిందర్‌ కౌర్‌కు ఆస్తి చెందుతుందని పేర్కొన్నారు. మొహిందర్‌ కౌర్‌ రాసిన వీలునామా ప్రకారం తనకు సంక్రమించే ఆస్తి ఆమె మరో కుమారుడు మంజిత్‌ ఇందర్‌ సింగ్‌ కుటుంబానికి చెందుతుంది.  ఎస్టేట్స్‌ యాక్ట్, 1948 ప్రకారం ఆస్తి అంతా తనకే చెందుతుందని అమృత్‌ కౌర్‌ వాదించారు. జేష్టస్వామ్య సంప్రదాయం ప్రకారం.. పెద్ద కుమారుడికి కానీ, లేదా జీవించి ఉన్న పెద్ద సోదరుడి కుటుంబానికి కానీ ఆస్తిపై హక్కు ఉంటుందని మంజిత్‌ ఇందర్‌ సింగ్‌ కుమారుడు భరత్‌ ఇందర్‌సింగ్‌ వాదించారు. వీలునామా ప్రకారం ఆస్తి అంతా తాను నిర్వహిస్తున్న ట్రస్ట్‌కు చెందాలని దీపిందర్‌ సింగ్‌ కోరారు. వీరి వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఆస్తిపై హక్కు కోసం కుట్రపూరితంగా రూపొందించారని పేర్కొంటూ వీలునామాను కొట్టివేసింది.

ఫరీద్‌ కోట్‌ రాజమహల్‌

మరిన్ని వార్తలు