కుమారుడికి ఉద్యోగం.. తండ్రికి పదోన్నతి

27 Jul, 2019 13:34 IST|Sakshi

చండీగఢ్: భారతదేశ చరిత్రలో కార్గిల్‌ యుద్ధానికి ప్రత్యేకం స్థానం ఉంది. మంచుకొండలపై మాటు వేసి భారత్‌ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్‌కు విజయాన్ని అందించింది. అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న ‘విజయ్ దివస్’ నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా నాడు దేశం కోసం వీరోచితంగా పోరాడిన యుద్ధ వీరుడు సత్పాల్‌ సింగ్‌ గురించి మీడియాలో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. నాడు యుద్ధంలో సత్పాల్‌ చూపిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు ‘వీర్‌ చక్ర’ అవార్డు కూడా ప్రదానం చేసింది. సైన్యం నుంచి బయటకు వచ్చిన అనంతరం ప్రస్తుతం సత్పాల్‌ సింగ్‌ పంజాబ్‌లోని ఓ చిన్న పట్టణంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నిన్న కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సత్పాల్‌ గురించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

అది కాస్త పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ దృష్టికి వెళ్లడం.. ఆయన వెంటనే సత్పాల్‌కు అసిస్టెంట్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌గా ప్రమోషన్‌ ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. అంతేకాక సత్పాల్‌ కొడుకు పీజీ పూర్తి చేసి ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడు. సత్పాల్‌ కథనానికి స్పందించిన ఓ విద్యాసంస్థల చైర్మన్‌, కూల్‌ డ్రింక్స్‌ కంపెనీలు సత్పాల్‌ కొడుకుకు ఉద్యోగం ఇవ్వడానికి ఆసక్తి చూపాయి. దీని గురించి ఇప్పటికే సత్పాల్‌ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్లు సమాచారం. దీంతో సత్పాల్‌ కొడుకు కూడా త్వరలోనే ఉద్యోగంలో చేరనున్నట్లు తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు