90 వేల మంది ఎన్నారైలు..పలువురికి కరోనా లక్షణాలు

24 Mar, 2020 09:11 IST|Sakshi

90 వేల మంది ఎన్నారైలు వచ్చారు: పంజాబ్‌

చండీగఢ్‌ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విజృంభణ నేపథ్యంలో దాదాపు 90 వేల మంది ఎన్నారైలు రాష్ట్రానికి వచ్చారని పంజాబ్‌ ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా రాష్ట్రానికి రూ.150 కోట్ల నిధులు కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి బల్బీర్‌ సింగ్‌ సిధు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. ‘‘దేశ వ్యాప్తంగా అత్యధిక మంది ఎన్నారైలు పంజాబ్‌కు చెందినవారే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేవలం 90,000 మంది మాత్రమే ఈ నెలలో రాష్టానికి వచ్చారు. వారిలో చాలా మందిలో కోవిడ్‌-19 లక్షణాలు బయటపడ్డాయి. రోజురోజుకీ వారి సంఖ్య పెరుగుతోంది. కావున వారందరి భద్రత దృష్ట్యా.. పారిశుద్ధ్యం, వైద్య పరంగా సన్నద్ధమయ్యేందుకు రూ. 150 కోట్ల నిధులు కేటాయించగలరు’’అని లేఖలో విజ్ఞప్తి చేశారు. కాగా పంజాబ్‌లో ఇప్పటివరకు 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఒక మరణం సంభవించింది. (కరోనాను అడ్డుకునే సామర్థ్యం భారత్ సొంతం)

ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించిన 48 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా హోం క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కాగా భారత్‌లో కరోనా ప్రభావం తీవ్రతరమవుతున్న విషయం తెలిసిందే. సోమవారం నాటికి కరోనా బాధితుల సంఖ్య 468కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా తొమ్మిది మరణాలు సంభవించాయి.
 

మరిన్ని వార్తలు