'రూ. 25 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం'

5 Jan, 2016 19:16 IST|Sakshi
'రూ. 25 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం'

గురుదాస్ పూర్: పఠాన్ కోట్ దాడిలో వీరమరణం పొందిన తమ ఇద్దరు పంజాబ్ సైనికుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ ఆర్థిక సహాయం ప్రకటించారు. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీయిచ్చారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంలోకి చొరబడిన ఉగ్రవాదులతో పోరాడుతూ పంజాబ్ చెందిన హానరీ కెప్టెన్ ఫతే సింగ్, హవల్దార్ కుల్వంత్ సింగ్ నేలకొరిగారు.

ఖదియన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన సంగత్ దర్శన్ కార్యక్రమంలో బాదల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశం కోసం ప్రాణాలు వదిలిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. పఠాన్ కోట్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులందరినీ ఆదుకుంటామని హామీయిచ్చారు. అమరవీరుల కుటుంబాలను సంప్రదించి తగిన సాయం అందించాలని ప్రభుత్వ అధికారులను బాదల్ ఆదేశించారు. ఉగ్రవాదుల చొరబాటుకు ఆస్కారం లేకుండా సరిహద్దు వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు