పూరీ జగన్నాథునికి జ్వరమా?  

29 Jun, 2018 12:07 IST|Sakshi

తెర మరుగుకు స్వామి

గోప్యంగా ఉపచారాలు

యవ్వన రూపానికి కసరత్తు

ఔను స్వామికి జ్వరమే. ఒళ్లంతా నొప్పులు, తల బరువు, రొంప వంటి సంకట పరిస్థితుల్లో స్వామి అల్లాడిపోతాడు. మూలిక ఔషధాలు, తైల మర్దన, పత్యపు నైవేద్యాలు, కషాయం సేవన వంటి ఉపచారాలతో స్వామి తెర చాటున 15 రోజులపాటు భక్తులకు దూరంగా ఉంటాడు. పండ్లు, తేలికపాటి పొడి పదార్థాల్ని స్వామికి పక్షం రోజులపాటు నిరవధికంగా నివేదిస్తారు.

భువనేశ్వర్‌: జగన్నాథుని సంస్కృతి, ఆచార–వ్యవహారాలు పరికిస్తే చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది. సామాన్య మానవుని వాస్తవ జీవనంలో చవి చూసే సరదా సంతోషాలతో అనారోగ్యం వంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి అధిగమించే అద్భుత ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహిస్తారు.

జగన్నాథుడు యాత్ర ప్రియుడు. ఈ హడావిడిలో భారీగా స్నానం ఆచరించడంతో శారీరక పరిస్థితి అదుపు తప్పుతుంది. చీకటి మండపానికి తరలి వెళ్లి తెర చాటున గోప్య సేవల్ని అందుకుని నిత్య యవ్వన రూపంతో పక్షం రోజుల తర్వాత ప్రత్యక్షమవుతాడు. ఏటా నిర్వహించే స్నానోత్సవ సంక్షిప్త సారాంశం ఇది. 

జగన్నాథుని వార్షిక రథయాత్ర తొలి ఘట్టానికి గురువారం అంకురార్పణ జరిగింది. శ్రీ మందిరం ప్రహరి మేఘనాథ్‌ ప్రాంగణం బహిరంగ వేదికపై రత్న వేదికపైకి మూల విరాట్లను తరలించి భారీ స్నానం చేయించారు. సుభాషిత జలంతో బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథుడు, సుదర్శనుడు ఈ జలాభిషేకంతో తడిసి ముద్దయ్యారు.

అనంతరం గజానన అలంకారంతో ముస్తాబు అశేష భక్త జనానికి బహిరంగ వేదికపై దర్శనం ఇవ్వడం స్నానోత్సవ విశిష్టత. 15వ శతాబ్దంలో మహా రాష్ట్ర నుంచి విచ్చేసిన గణపతి భక్తుని అభీష్టం మేరకు ఏటా స్వామి గజానన  అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నట్లు కథనం ప్రచారంలో ఉంది. 

స్నానోత్సవంలో మఠాల పాత్ర

జగన్నాథునికి సేవలు కల్పించడం మహాభాగ్యం. శ్రీ మందిరం పరిసరాల్లో దశాబ్దాలుగా నెలకొల్పిన మఠాలు స్వామి ఉత్సవాదుల్లో ప్రత్యేక పాత్ర పోషి స్తాయి. ఆలయ సంప్రదాయాల మేరకు రాఘవ దాసు మఠం, గోపాల తీర్థ మఠం స్వామి స్నానోత్సవానికి అవసరమైన సరంజామా అందజేస్తాయి.

పక్షం రోజులు పొట్టా చిత్రాలే

శ్రీ మందిరం రత్న వేదికపై రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం  జగన్నాథుని మూల విరాట్‌ దర్శనం పక్షం రోజులపాటు కనుమరుగవుతుంది. ప్రతినిధి దేవుళ్ల చిత్ర పటాలు (పొట్టా చిత్రొ) భక్తులకు దర్శనమిస్తాయి. మహా అభిషేకం చేసుకున్న స్వామి చీకటి మండపానికి తరలివెళ్తాడు. పక్షం రోజులు ఈ మండపంలోనే సేవాదులు నిర్వహిస్తారు.

ఈ వ్యవహారం నేపథ్యంలో భక్త జనంలో పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. జగన్నాథుని ప్రతి ఆచారం భిన్నాతిభిన్నమైన సందేశాల్ని ప్రసారం చేస్తుంది. మానవుని నిత్య జీవన శైలిని  జగన్నాథుని సంస్కృతిగా పేర్కొంటారు. 

ప్రకృతి ప్రభావ ప్రతిబింబం

జగతి నాథుడు జగతిలో చిత్ర విచిత్రాలపట్ల సర్వ మానవాళిని చైతన్య పరిచేందుకు ఉత్సవ రీతిలో అపురూపమైన సందేశాన్ని ప్రచారం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. స్వామి స్నానోత్సవం తర్వాత వానా కాలం పుంజుకుంటుంది. ఈ వానల్లో తడిస్తే సామాన్య మానవుని పీడించే జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి పరిస్థితుల్లో తీసుకోవలసిన జాగ్రత్తల్ని జగన్నాథుని గోప్య సేవలు, ప్రత్యేక నైవేద్యాలు సూచిస్తాయి. 

లంకణం ఆరోగ్య దాయకం

జ్వరంతో నలిగిన శరీరానికి పత్యపు ఆహార సేవన కొత్త యవ్వనం ప్రదానం చేస్తుందనే స్పృహను జగన్నాథుని స్నానోత్సవ ఘట్టం చివరి అంకం స్పష్టం చేస్తుంది. విశ్వవ్యాప్త భక్త జనం కంటిలో పడకుండా (ఐసీయూ) కట్టుదిట్టంగా ఆరోగ్య నియమాల్ని పాటించిన జగన్నాథుడు 15 రోజులయ్యేసరికి నవ యవ్వనుడుగా ప్రత్యక్షమవుతాడు.

స్నాన పూర్ణిమను పురస్కరించుకుని అనారోగ్యం బారిన పడి చీకటి గదికి తరలి వెళ్లిన స్వామి ఒక్క సారిగా సరికొత్త మూర్తిగా ప్రత్యక్షమవుతాడు. ఈ ప్రత్యక్ష దర్శనమే నేత్రోత్సవం, నవ యవ్వన ఉత్సవం. రథయాత్ర ముందు రోజు ఈ వేడుక నిర్వహిస్తారు.  

జాగ్రత్త – పటిష్టత

ఆరోగ్యమే మహా భాగ్యం సందేశాన్ని జగన్నాథుని స్నానోత్సవం ప్రసారం చేస్తుంది. ప్రధాన దేవాలయం రత్న వేదికపై చతుర్థా దారు (కలప) మూర్తులు నిత్యం ధూప దీపాదులతో సేవల్ని అందుకుని మసకబారుతాయి. వన్నె కోల్పోతాయి. సమయం, సందర్భోచితంగా స్నానాదులు ఆచరించి నిత్యం తేజోవంతంగా వెలుగొందే విధి విధానాలు ఈ ప్రక్రియలో తారసపడతాయి. మహా స్నానం పురస్కరించుకుని భారీ దారు విగ్రహాలు సుభాషిత జలంతో శుభ్రమవుతాయి.

అభిషేకం ప్రభావంతో మసకతో బాటు దారు విగ్రహాల రంగుల కళ కడుక్కు పోతుంది. ఈ కళల్ని అద్దడం బృహత్తర ప్రక్రియ. దీనిని గోప్యంగా నిర్వహించాలి. ఈ వ్యవధిలో సాధారణ ధూపదీపాదులు, నైవేద్యాల నివేదన సాధ్యం కాదు. ఈ ప్రక్రియను నియంత్రించి మూల విరాట్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ప్రధాన వ్యవహారంగా చిట్ట చివరగా స్పష్టమవుతుంది. కొత్త వస్త్రాలు, రంగులు అద్దుకుని స్వామి ప్రత్యక్షం కావడం నూతన కళాకాంతుల్ని విరజిమ్మి కనులకు (నేత్రాలు) ఉత్సవ శోభను ప్రదర్శిస్తుంది.  

మరిన్ని వార్తలు