‘నమాజ్‌ చేస్తే తప్పులేదు.. కానీ పూజలు చేయకూడదా’

19 Nov, 2018 11:08 IST|Sakshi

ఆగ్రా : బజరంగ్‌ దళ్‌కు చెందిన మహిళా కార్యకర్తలు కొందరు తాజ్‌ మహల్‌ వద్ద శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. తాజ్‌ మహల్‌ ప్రాంగణంలోని మసీదులో శుక్రవారం మినహా ఇతర రోజుల్లో నమాజ్‌ చేయకూడదంటూ సుప్రీం కోర్టుతో పాటు ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్ఐ) కూడా ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏఎస్‌ఐ ఉత్తర్వులను పట్టింకుకోండా కొందరు ముస్లింలు తాజ్‌ వద్ద ఉన్న మసీదులో గత బుధవారం నమాజ్‌ చేశారు. విషయం తెలుసుకున్న బజరంగ్‌ దళ్‌ మహిళా కార్యకర్తలు కొందరు ఏఎస్‌ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తాజ్‌ మహల్‌ వద్ద శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. దానిలో భాగంగా తాజ్‌ వద్ద హరతి కార్యక్రమం నిర్వహించి.. గంగా జలాన్ని చల్లారు.

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ఇక్కడ నమాజ్‌ చేసి తాజ్‌ పరిసరాలను అపవిత్రం చేశారు. అందుకనే మేం గంగా జలంతో దాన్ని శుద్ది చేశాం. ఇతరులు(ముస్లింలు) వచ్చి ఇక్కడ నమాజ్‌ చేస్తున్నప్పుడు.. మేం తాజ్‌ మహల్‌లోకి పూజాద్రవ్యాలు తీసుకెళ్లడం తప్పా అంటూ వారు ప్రశ్నించారు. వారికి(ముస్లింలకు) శుక్రవారం మాత్రమే తాజ్‌ వద్ద నమాజ్‌ చేసుకునేందుకు అనుమతించారు. కానీ మిగతా రోజుల్లో ఎందుకు ఇక్కడ నమాజ్‌ చేస్తున్నట్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ మేం చేసింది తప్పని భావిస్తే ఎలాంటి చర్యలనై తీసుకోండి.. వాటిని ఎదుర్కొడానికి మేం సిద్దంగా ఉన్నామని తెలిపారు. నమాజ్‌ కోసం వెళ్లిన వారిన ఆపలేదు.. కానీ మమ్మల్ని మాత్రం ఎలా అడ్డగిస్తారంటూ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు